Dharani Portal: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్‌కు జనం నుంచి వస్తున్న సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం. అలాగే రెవెన్యూ శాఖ అంశాలపై జనానికి అవగాహన కల్పించేందుకు నెలకోసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ధరణిపై సీఎం నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాని స్థానంలో మరింత మెరుగ్గా భూమాత పోర్టల్ తెస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ధరణి విషయంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.