రిటైరయినా తగ్గేదే లే బిగ్ బి, షారూఖ్ ను దాటేసిన ధోనీ

ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు... జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు.

  • Written By:
  • Publish Date - December 11, 2024 / 03:45 PM IST

ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు… జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు. అందుకే చాలా మంది ఎక్స్ పర్ట్స్ భారత క్రికెట్ ను ధోనీకి ముందు, ధోనీ తర్వాత అంటూ రెండు విధాలుగా చెబుతారు. దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన ఏకైక భారత సారథిగా చరిత్ర సృష్టించిన ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్ళు దాటిపోయినా బ్రాండింగ్ లో మహిని కొట్టేవాడే లేడన్నట్టుగా ఉంది. ధోనీకి చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో పలు కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికీ తమ బ్రాండ్స్ ప్రమోషన్ కోసం ఈ మాజీ కెప్టెన్ కోసం క్యూ కడుతున్నాయి. తాజాగా బ్రాండింగ్ లో ధోనీ… బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, షారూఖ్ లను దాటేశాడు. వారిద్దరి కంటే ఎక్కువ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

ధోని 2024 మొదటి ఆరు నెలల్లో 42 బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీనితో పాటు బ్రాండ్‌లను ఎండార్స్ చేయడంలో షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌ల కంటే ముందున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 41 బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదే సమయంలో, షారుక్ ఖాన్ ఈ కాలంలో 34 ఒప్పందాలపై సంతకం చేశారు. దీంతో ఈ బాలీవుడ్ దిగ్గజాల కంటే ముందు ధోనీ ఉన్నాడు. పైగా బాలీవుడ్ హీరోల బ్రాండ్ ప్రమోషన్స్ లో రోజుకు స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ధోనీ కేవలం 14 గంటల స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఏకంగా 42 బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలు మహి కంటే ఆరేడు గంటలు ఎక్కువగానే టీవీల్లో కనిపిస్తున్నా అధిక కంపెనీలు మాత్రం ధోనీ వైపే మొగ్గుచూపుతున్నాయి.

ఇదిలా ఉంటే ఒక వ్యాపార సంస్థ ధోని బ్రాండ్ విలువను అంచనా వేసింది. దీని ప్రకారం ధోనీ బ్రాండ్ విలువ 1081 కోట్లుగా అంచనా. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. వివిధ బ్రాండ్స్ కు ప్ర‌క‌ట‌న‌లు, ఐపీఎల్, ఇత‌ర వ్యాపారాల ద్వారా ధోని భారీగానే సంపాదిస్తున్నాడు. ఐపీఎల్ లో ఆడుతున్నందుకు సీఎస్కే ధోనికి సంవత్సరానికి 12 కోట్ల రూపాయల వేతనం చెల్లిస్తుంది. అలాగే పైగా ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ధోనీ ఒక రోజు యాడ్ షూట్ కోసం 4 నుంచి 6 కోట్లు తీసుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియా ద్వారా ధోనీ కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 40 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 25 మిలియన్లకు పైగా ధోనికి ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఈ రెండు ఖాతాల ద్వారా ధోనీ వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తారు. అలాగే ధోనీ స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టాడు. తాజాగా ధోనీ సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించాడు. ఇప్పటికే తమిళంలో ఓ చిత్రాన్ని నిర్మించాడు. మరిన్ని ప్రాజెక్టులు కూడా ముందున్నాయి. ఓవరాల్ గా స్పోర్ట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా, అత్య‌ధిక సంపాద‌న క‌లిగిన ప్రముఖుల జాబితాలోనూ ఒకరిడిగా మహి కొనసాగుతున్నాడు.