టీడీపీలో ఏదైనా చర్చ జరుగుతుంది అంటే.. అది కేవలం లోకేశ్ పాదయాత్ర కోసమే ! వారాహి యాత్రకు పవన్‌కు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ప్రతీచోట ఇసకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇవన్నీ ఓట్లుగా మారతాయా.. పవన్‌ను గెలిపిస్తాయా అన్నది కాదు మ్యాటర్. పవన్ టూర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి టీడీపీ ఎందుకు సైలెంట్ అయింది అన్నదే అసలు విషయం అనే చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో ! వారాహి యాత్ర మొదలుపెట్టిన పవన్.. జగన్, వైసీపీ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బటన్ నొక్కుడు నుంచి బాబాయ్ హత్య కేసు వరకు.. ప్రతీ విషయంలో వైసీపీని చీల్చి చెండాడుతున్నారు.
పవన్ వ్యాఖ్యల మీద జగన్ స్వయంగా రియాక్ట్ అవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. రాజకీయం ఎంతలా మండుతుందో ! టీడీపీ, జనసేనను దూరంగా ఉంచేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దత్తపుత్రుడు అని.. కాపులను తాకట్టు పెడుతున్నారని.. వైసీపీ నేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఐనా సరే ఆ రెండు పార్టీలు కలిసి వెళ్లాలనే డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నాయ్. అధికారికంగా రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన రాకపోయినా.. వ్యూహాలు మాత్రం రెండు పార్టీలు కలిసే అమలు చేస్తున్నాయనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ ప్రస్తుతం మౌనంగా ఉండడమే దానికి ఎగ్జాంపుల్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. పవన్‌ను ముందు పెట్టి ఆయనతో మాట్లాడించి.. టీడీపీ కావాలని మౌనంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి వివేకా హత్య గురించి పవన్ గతంలో పెద్దగా మాట్లాడింది లేదు. ఇప్పుడు మాత్రం ప్రతీ సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇసుక దోపిడీ, గంజాయి, పక్కా ఇళ్లు.. ఇలా పవన్ మాట్లాడే ప్రతీ మాట.. ఒకప్పుడు టీడీపీ నేతల నోటి నుంచి వినిపించిందే ! అన్నింటికి కంటే మరో ముఖ్య విషయం.. పవన్ జనాల్లో ఉంటే… బాబు కనిపించకపోవడం ! పవన్ పర్యటన ముందు వరకు బాబు నియోజకవర్గాల పర్యటనలు చేశారు. రోడ్ షోలు, సభల్లో పాల్గొన్నారు. ఎప్పుడైతే పవన్ టూర్ మొదలైందో.. చంద్రబాబు సైలెంట్ అయిపోయారు. పార్టీపరమైన కార్యక్రమాలే చూసుకుంటున్నారు. ఇద్దరు ఒకటే కాబట్టి.. ఎవరో ఒకరు జనాల్లో ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారా ! ఇద్దరు ప్రజాక్షేత్రంలోనే ఉంటే.. అనుకున్న విషయాలను జనాలకు చేర్చడం ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా అంటే అవును అనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు పవన్ వారాహి యాత్ర ముగిస్తే.. చంద్రబాబు లైన్‌లోకి వస్తారా అంటే.. ఏమో గుర్రం ఎగరావచ్చు.. ఏదైనా జరగొచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు సరికొత్త అనుమానం తెరమీదకు వస్తోంది. తనను సీఎం చేయండి అని పవన్ అడగడం వెనక కూడా.. పొత్తులో వ్యూహమే కారణమా అని ఇప్పుడు చాలామంది డౌటానుమానం.