ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు సిట్టింగ్‌లను తప్పించేసింది వైసీపీ. సీటివ్వకున్నా.. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసునంటూ.. ముందు గిల్లి తర్వాత జోలపాడారట పార్టీ పెద్దలు. ఇవి ఇక్కడితో ఆగవని, మరిన్ని మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తప్పించడం సంగతి సరే.. అసలు వాళ్లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ముఖ్యమంటున్నారు సీనియర్స్. అగ్ర నాయకత్వం ముందే హెచ్చరించినా.. మేల్కోకపోవడమా? లేక రన్నింగ్ రేస్‌లో వెనకబడితే వదిలేసి వెళ్లడం తప్ప ముందుకు లాక్కెళ్ళింది లేదని పార్టీ పెద్దలు తీసుకున్న కఠిన నిర్ణయంలో భాగమా అన్న చర్చ జరుగుతోంది.
సర్వే రిపోర్ట్స్ ఆధారంగా.. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటికి పరిష్కారాలను సైతం సూచించినా.. అటువైపు నుంచి ఆశించిన మార్పు లేకపోవడంవల్లే వేటు తప్పలేదంటున్నాయి వైసీపీ వర్గాలు. సీటు గెలవడమన్నది అల్టిమేట్ గోల్ తప్ప.. అక్కడ లీడర్‌గా ఎవరుంటే ఏంటన్నది పార్టీ అగ్రనాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంను బరిలో దింపనుంది ఫ్యాన్ పార్టీ. అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిపోయింది. చంటిబాబు వ్యవహార శైలే ఆయనను వన్ టైం ఎమ్మెల్యేని చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో కావాలని వివాదాలు మాట్లాడతారో.. లేక ఆయన మాటలే వివాదం అవుతాయోగానీ.. ఎప్పుడూ ఏదో ఒక గొడవను నెత్తినేసుకుని తిరుగుతుంటారని చంటిబాబుకు పేరుంది. ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌కి కూడా ఈసారి పోటీ చేసే అవకాశం లేదు.
గత ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయిపోయారు పర్వత.. అంతే స్థాయిలో వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా మారారట.. ఆయన తీరుకు నిరసనగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన చేశారు. చివరికి విసిగి వేసారి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. సొంత కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత లేకపోవడం ఆయనకు మైనస్‌గా మారిందట. ముందు నుంచి పార్టీలో ఉన్న వారిని కాకుండా సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో మైలేజ్ తగ్గిందన్నది లోకల్ టాక్. ఈసారి ప్రత్తిపాడును పర్వత ఫ్యామిలీలో మరొకరికి లేదా మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఫ్యామిలీకి కేటాయించే ఛాన్స్ ఉంది.. పిఠాపురం విషయంలో కూడా ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసింది వైసీపీ.
దానికి తగ్గట్లుగా ఆయనకి ఇండికేషన్స్ కూడా ఇచ్చింది.. ఇక్కడ నుంచి ఎంపీ వంగా గీతకి ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పనితీరు లేకపోవడం, ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో వెనకబడి ఉండడం దొరబాబుకు మైనస్ అయ్యాయంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. ఎమ్మెల్యే ద్వారంపూడి, మంత్రి దాడిశెట్టి రాజాకు మధ్య ఉన్న ఆధిపత్య పోరులో పెండెం దొరబాబు రాజా వైపు వెళ్లడం, దాంతో ద్వారంపూడి పర్సనల్ గా తీసుకుని సీటు మార్చే విషయంలో పట్టు పట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరోవైపు రామచంద్రాపురం వైసీపీలో జరిగినంత రచ్చ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు.. మంత్రి వేణు, ఎంపీ పిల్లి బోస్ వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు గట్టిగానే చేసుకున్నాయి.
దాంతో ఆ సీటు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది.. అటు విధేయతను ఇటు మంత్రిని కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కారణాలతోనే చివరికి మంత్రికి స్థాన చలనం తప్పలేదన్న చర్చ ఉంది.. ఇక్కడ నుంచి పిల్లి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ బరిలో ఉంటారని అంటున్నాయి. రామచంద్రపురం సీటు కోసం ముందు నుంచి పట్టుపట్టిన మంత్రి వేణు పక్కకు తప్పుకోక తప్పలేదట. మొత్తానికి ఆ నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులతో జిల్లాలో రిపేర్లు మొదలుపెట్టింది వైసీపీ. ముగ్గురిని పక్కన పెట్టి మంత్రికి నియోజకవర్గం మార్చింది. ఇదంతా చూస్తున్న వారు మాత్రం చేసుకున్నవారికి చేసుకున్నంత అంటున్నారు. మరి కొత్త ఈక్వేషన్స్ అధికార పార్టీకి ఏ విధంగా కలిసి వస్తాయో, ప్రస్తుత సిట్టింగ్‌లు ఏ మేర సపోర్ట్ చేస్తారో చూడాలి.