ఈమధ్య కాలంలో ఓటీటీ వేదికల హవాయే నడుస్తోంది. సినిమాను థియేటర్లకు వెళ్లిచూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఏదైనా బ్రహ్మాండమైన హిట్ అయితే తప్ప సినిమా హాల్స్ వైపు చూడటం లేదు ప్రేక్షకులు. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ వేదికలు తమ సబ్ స్క్రిప్షన్ ధరలను అమాంతం పెంచిన విషయం మనకు తెలిసిందే. పైగా పాస్ వర్డ్ షేరింగ్ లోనూ చాలా షరతులు విధించాయి. అయితే తాజాగా ఈ బాటలోకి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా రావడం చర్చనీయాంశమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నవంబర్ 1 నుంచి సరికొత్త రూల్స్ ను తీసుకురానున్నట్లు వెల్లడించింది. తన పాస్ వర్డ్ షేరింగ్ పై కొన్ని ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఈవిషయాన్ని కెనడాలోని సబ్ స్క్రైబర్లకు తన ఒప్పందానికి సంబంధించిన అప్డేట్ లో మొయిల్ రూపంలో తెలిపింది. దీనిపై వెర్జ్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అకౌంట్ అండ్ పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో కఠిన ఆంక్షలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక హెల్ప్ సెంటర్ ను కూడా తన అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది.
ఈ క్రమంలో యూజర్స్ తమ అకౌంట్ అండ్ పాస్ వర్డ్ ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా వారి అకౌంట్లను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది. నిబంధనలను ఎవరైనా ఉల్లంగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ వేదికలో సబ్ స్క్రిప్షన్ ను శాశ్వతంగా తొలగిస్తామని సూచించింది. ఈ ఆంక్షలు నవంబర్ 1 నుంచి కెనడాలో అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంతో పాటూ ఇతర దేశాల్లో కూడా క్రమక్రమంగా అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాన్యునికి ఓటీటీ మాధ్యమాలు గుదిబండలా మారనున్నాయి. వినోదం చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. రానున్న రోజుల్లో ఇంకెన్ని వేదికలు ఇలాంటి సరికొత్త రూల్స్ ని తీసుకువస్తాయో వేచిచూడాలి.
T.V.SRIKAR