ఇంత బిజీ ఎందుకు.. పెద్ద హీరోల తీరుతో టాలీవుడ్ సంక్షోభం వైపు వెళ్తోందా.. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్తున్నారా.. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి రాజమౌళి కూడా ఓ కారణమా.. ఈసారి సమ్మర్ నీరుగార్చింది. చిన్న సినిమాలు తప్ప.. పెద్ద సినిమా ఒక్కటి కూడా కనిపించలేదు థియేటర్‌లో. హీరోలు ఏమైనా ఖాళీగా ఉన్నారా అంటే అదీ కాదు. అందరూ బిజీ. వన్ ఇయర్, 2 ఇయర్స్ కాదు.. మూడేళ్ల వరకు కనీసం ఒక్క కాల్షీట్ కూడా ఖాళీగా లేని పరిస్థితి. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, తారక్.. బడా హీరోలంతా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. బడా హీరోల ఈ తీరే ఇప్పుడు టాలీవుడ్‌ను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఏడాదికొకటి, రెండేళ్లకో సినిమా చేస్తుండటంతో టాలీవుడ్.. దిక్కుతోచని స్థితుల్లోకి వెళ్లిపోతోంది.
కరోనా తర్వాత మరోసారి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది టాలీవుడ్. చిన్న సినిమాలకు క్వాలిటీ ఉండదు. పెద్ద సినిమాలేమో రెండేళ్ల టైం తీసుకుంటున్నారు. దీంతో బయ్యర్లు, థియేటర్ల ఓనర్లు అయోమయంలో పడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ 2025 వరకు బిజీ. 2027వరకు ప్రభాస్‌కు కాల్షీట్స్ లేవు. కన్నడ యష్‌కి కథ చెబితే 2026లో కలుద్దాం అంటాడు. మరో రెండేళ్ల వరకు రాంచరణ్ కథలే వినను అన్నాడు. సూర్యకు కథ చెబితే వింటాడు.. కానీ ప్లీజ్ కమ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటాడు. ఏడాదికి ఒక హీరో రెండు సినిమాలు చేస్తేనే.. ఆహా ఓహో అనుకోవాల్సిన పరిస్థితి. పవన్‌లాంటి స్టార్.. సినిమా తీసి మూడేళ్లయింది. ట్రిపుల్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయలేదు. అటు రాంచరణ్‌కు కూడా సినిమా లేదు. భారీ సినిమాలు, పెద్ద సినిమాల పేరుతో ఏడాది, రెండేళ్ల టైమ్ తీసుకుంటున్నారు.
దీంతో ఇండస్ట్రీనే కాదు.. థియేటర్లు, బయ్యర్లు కూడా సంక్షోభంలో పడ్డారు. పెద్ద నిర్మాతలు మూడేళ్ల దాకా అగ్ర హీరోలందరికీ కథలు లేకుండానే అడ్వాన్సులు ఇచ్చి బ్లాక్ చేస్తున్నారు. ఒక్కో సినిమా రెండేళ్ల పాటు తీసే రాజమౌళి.. ఏదో ట్రెండ్ సెట్ చేశారు అనుకున్నారంతా ! ఆ రెండేళ్ల సినిమా తీసే స్టైల్‌తో ఇండస్ట్రీనే కుప్పకూల్చాడు. ప్రశాంత్ నీల్‌తో సినిమా అంటే కూడా అదే పరిస్థితి. పోనీ పెద్ద సినిమాలు వచ్చినవైనా గొప్ప సినిమాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. సంక్రాంతి తర్వాత ఒక్క హిట్ లేదు. ప్రభాస్ మూడు భారీ సినిమాలు తీస్తే.. మూడూ ఫ్లాపులే! లైగర్ లాంటి సినిమా… హీరోని, డైరెక్టర్‌ని డార్క్‌రూమ్‌లోకి తోసేసినట్లు అయింది. ఒకప్పుడు యేడాదికి హీరోలు 12 నుంచి 14 సినిమాలు తీసేవారు. ఇప్పుడు సూపర్ క్వాలిటీ, గ్రాఫిక్స్ పేరుతో ఒకటీ రెండు సినిమాలు తప్ప.. పెద్దగా రావడం లేదు. భారీ రెమ్యూనరేషన్లు, నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి… ఎక్కువ సినిమాలు తీసే పరిస్థితి లేదు. పోనీ చిన్న సినమాలైనా మంచివి వస్తున్నాయా అంటే.. అదీ లేదు.
చాప చుట్టేసినట్లు చుట్టేసి రెండు గంటల ఫీడ్‌ను జనాల మీదకి విసిరేయడం తప్ప.. చిన్న సినిమాల్లో అసలు విషయం ఉండటం లేదు. ఒక్క మలయాళం ఇండస్ట్రీ మాత్రమే… చిన్న సినిమాని పెద్ద సినిమాని బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది. మంచి కథలు, కథనంతో చిన్న సినిమాలు… అడపాదడపా భారీ సినిమాలు మలయాళం ఇండస్ట్రీని బతికిస్తున్నాయ్. టాలీవుడ్ పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అనిపిస్తోంది. మూడు నెలల నుంచి తెలుగు సినిమా పరిస్థితి మరీ దారుణం. ఒక్క పెద్ద సినిమా లేదు.. బయ్యర్లు గుండెలు బాదుకుంటున్నారు. థియేటర్ల ఓనర్లు బోరున ఏడుస్తున్నారు. సినిమాల ఫ్లో ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏడాదికి ఒకటో రెండు సినిమాలే వస్తుంటే ఇండస్ట్రీ మనుగడ ఎలా.. ఓటీటీలు వచ్చి థియేటర్లను దెబ్బకొట్టాయ్. హీరోలు కూడా బాగా ఆలస్యం చేస్తుండటంతో రెగ్యులర్ థియేటర్లు, బయ్యర్లు చావుదెబ్బ తిన్నారు. అయ్యా బడా హీరోల్లారా.. ఇప్పటికైనా మారండి. భారీ బడ్జెట్, భారీ హంగుల పేరుతో.. రెండేళ్లు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటే.. ఇండస్ట్రీ బతకడం కూడా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి.