మనదేశం పేరు మార్పుపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ‘ఇండియా’ను ఇక ‘భారత్’గా మారుస్తూ సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ లో ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో ఒకసారి చరిత్రలోకి వెళ్లి మన దేశానికి ఏయే టైంలో ఎన్నెన్ని పేర్లు వాడారో తెలుసుకుందాం.
మెలూహ
క్రీస్తు పూర్వం 6 వేల సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఇండియాకు అనేక పేర్లు వాడుకలో ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. మెసపటోమియా (నేటి ఇరాక్) నాగరికతలోని సుమేరియన్లు మాత్రం ఇండియాను ‘మెలూహ’ అని పిలిచేవారట. సుమేరియన్ల క్యూనిఫారం మట్టిపలకల్లోని రాతల్లో హరప్పా ప్రాంతాన్ని ‘మెలూహ’ అని సంబోధించారు. ఈ మట్టిపలకలు క్రీస్తు పూర్వం 5-6 వేల సంవత్సరాల కాలం నాటివి. హరప్పా నాగరికత ప్రస్తుత పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌తో పాటు భారత్‌లోని గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ ప్రాంతాల వరకు విస్తరించింది. మెలూహ పేరుతో దక్షిణ, తూర్పు భారతదేశానికి సంబంధం లేదని చరిత్రకారులు అంటున్నారు.
భరత వర్ష
క్రీసుపూర్వం 1500 కాలంలో ఇండియాను ‘భరత వర్ష’ అని పిలిచేవారు. మహాభారత కాలంలో కూడా ఈ పేరునే వాడారని నమ్ముతారు. అయితే, ‘భరత వర్ష’ అనే పేరు ఆనాడు పంజాబ్, హర్యానా, ఢిల్లీ పశ్చిమప్రాంతం, కశ్మీర్ వరకే పరిమితమైందని అంటున్నారు.
‘ఆర్యావర్తనం’
మన ఇండియాలోకి ఆర్యులు వచ్చి స్థిరపడిన ఉత్తర, పశ్చిమ ప్రాంతాన్ని కలిపి ‘ఆర్యావర్తనం’ అని పిలిచేవారట. మనుస్మృతి, పురాణాల్లో ఆర్యావర్తనమనే ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతం నేటి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్‌ను కలుపుతూ హిమాలయాల దక్షిణ ప్రాంతాలు, కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానాతోపాటు అఫ్గాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉండేదట. అయితే ఆర్యావర్తనంలో ద్రవిడ ప్రాంతం (సౌత్ ఇండియా) లేదు.
‘ద్రవిడ’
ద్రవ్య అంటే ‘నీరు’, విడ అంటే ‘కలిసే చోటు’. ఈ రెండు పదాల కలయికగా ‘ద్రవిడ’ పదం ఏర్పడింది. హిందూమహా సముద్రం, అరేబియా సముద్రం బంగాళాఖాతం కలిసే ప్రాంతాన్ని ‘ద్రవిడ’ ప్రాంతంగా గతంలో పిలిచారట. ప్రస్తుతం ఇది మన సౌత్ ఇండియా. ‘నభివర్ష, ఇలావతి వర్ష’ అనే పేర్లు కూడా మన ఇండియాకు ఉండేవని హిస్టారియన్లు చెబుతున్నారు.
హిందుస్థాన్
ఇక ఇండియాకు ‘హిందుస్థాన్’ అనే పేరును పెట్టింది పర్షియన్లే (ఇరాన్) అని చరిత్రకారులు చెబుతున్నారు. సింధూ నది ఉన్న ప్రాంతం కావడం వల్లే మన దేశానికి హిందుస్థాన్ అనే పదాన్ని పర్షియన్ల ఆనాడు వాడారని అంటున్నారు. పర్షియన్లు తొలిసారి సప్తసింధుపై దాడిచేసిన సమయంలో.. సింధూ నదిని పొరపాటున హిందూ నది అని పిలిచారని, ఆ విధంగా హిందూ పదం వాడుకలోకి వచ్చిందని ఇంకొందరు వాదిస్తున్నారు. పర్షియన్ల తర్వాత వచ్చిన అఫ్గాన్లు, మొఘలులు కూడా ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అనే పిలిచారని చరిత్రకారులు తెలిపారు.
జంబూద్వీపం
కౌటిల్యుడి‘అర్థశాస్త్రం’లో ఇండియాను ‘జంబూద్వీపం’ అని పిలిచారు. హిమాలయాల నుంచి త్రిసముద్ర మధ్యప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి పిలిచిన మొదటి పేరు ఇదేనని చరిత్రకారులు అంటున్నారు. హిందువులు పూజల సమయంలో పఠించే మంత్రాల్లో కూడా ‘జంబూద్వీపే’ అని పలుకుతుంటారు. జంబూద్వీపమంటే హిమాలయాల నుంచి బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం మధ్య ప్రాంతమని కౌటిల్యుడు వివరించారు. కౌటిల్యుడు క్రీస్తుపూర్వం 200 టైంలో జీవించారు.
‘ఇండియా’ ఎలా వచ్చింది ?
క్రీస్తుకు పూర్వం 326లో ఇండియాపై దండయాత్రకు వచ్చిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ సింధూనదిని ఇండస్ అని పిలిచాడు. అలెగ్జాండర్ ప్రతినిధిగా ఆఫ్ఘనిస్థాన్‌ను పాలించిన సెల్యూకస్ నికెటర్ 1, మగధను పాలిస్తున్న చంద్రగుప్త మౌర్యుడి వద్దకు మెగస్తనీస్ అనే రాయబారిగా పంపాడు. అతడు చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్న టైంలో ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ పేరుతోనే ‘ఇండియా’ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. యూరోపియన్ల రాక మొదలైన తర్వాత ఇండియా పేరు బాగా వాడుకలోకి వచ్చింది. పురాణ గ్రంథాల్లో ఎక్కడా ఇండియా అనే పేరు లేదు.