ఒలింపిక్స్ (Olympics) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన మను భాకర్.. భారత్‌కు ఫస్ట్ మెడల్ అందించింది. పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ (Indian women shooter) గా రికార్డు క్రియేట్ చేసిన మను భాకర్‌పై.. దేశవ్యాప్తంగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి మనును అభినందించారు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. మెడల్ గెలవడం కోసం మను భాకర్ చాలా కష్టపడింది. జస్పల్ రాణా (Jaspal Rana) శిక్షణలో.. మను తన టార్గెట్ రీచ్ అయింది. ఆమెకు భారత ప్రభుత్వం (India Government) కూడా అన్ని విధాలుగా అండగా నిలిచింది. జర్మనీ (Germany), స్విట్జర్లాండ్ (Switzerland) లో మను భాకర్‌కు ట్రైనింగ్ ఇప్పించింది.
దీనికోసం మోదీ ప్రభుత్వం (Modi Government) దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేలా.. మన అథ్లెట్లు అందరికీ ఇలాంటి వాతావరణమే కల్పిస్తున్నామని కేంద్రమంత్రి మన్సూఖ్ మాండవీయా చెప్పారు. దేశంలో క్రీడలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం… ప్రధాని మోదీ ఖేలో ఇండియాను ప్రారంభించారు. దీంతో క్రీడల్లో పోటీ పెరిగింది. స్కూల్, కాలేజీ స్థాయిల్లో ప్రతిభను వెలికితీయడం కోసం ప్రాజెక్టులను మొదలుపెట్టామని.. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడానికి మంచి కోచ్‌లను నియమించామని మాండవీయా చెప్పారు.
ఇక ఇదంతా ఎలా ఉన్నా.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారత్… ఒలింపిక్స్ లాంటి విశ్వవేదికలపై ఎప్పుడూ ఫెయిల్ అవుతోంది. పొరుగున ఉన్న చైనాతోపాటు కొరియా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి చిన్న దేశాలు కూడా పతకాల పంట పండిస్తుంటే.. మనం మాత్రం పతకాల వేటలో వెనుకబడ్డాం. దీంతో ఒలింపిక్స్, ఇతర క్రీడా ఈవెంట్లలో భారత్ సత్తా చాటడమే లక్ష్యంగా ఖేలో ఇండియాను మోదీ సర్కార్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందిస్తారు.