Chandrababu In Jail: తొలిరోజు జైలులో చంద్రబాబు ఎలా గడిపారు ?

చంద్రబాబు జైల్ షెడ్యూల్ ఇలా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 12:28 PM IST

చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. జైలులో ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. ఇంటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని, మందులను కూడా అనుమతించాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఆహారాన్ని, మందులను తీసుకెళ్లి చంద్రబాబుకు అందించేందుకు ఒక వ్యక్తిని కూడా నియమించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో తొలి రోజు కొంత ఆందోళనతో గడిపారని తెలుస్తోంది. ఆయనను ఆదివారం అర్ధరాత్రి టైంలో ఆలస్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు టీవీ వార్తలను చూస్తూ కూర్చొని.. ఆ తర్వాతే చంద్రబాబు నిద్రపోయారని తెలుస్తోంది. మళ్లీ ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత మేల్కొన్నారని సమాచారం. జైలులో కూడా సోమవారం ఉదయం నిద్రలేవగానే కాసేపు యోగా, చిన్నపాటి వ్యాయామాన్ని చంద్రబాబు చేశారు. దీన్నిబట్టి ఆయన ఆరోగ్యానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చంద్రబాబు చదవడానికి కొన్ని న్యూస్ పేపర్లను కూడా జైలు అధికారులు రెడీగా ఉంచినట్లు తెలిసింది.

చంద్రబాబు ఆహార నియమాలు ఇవీ..

చంద్రబాబు ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు. ఉదయాన్నే మామూలు ఇడ్లీ లేదా జొన్న ఇడ్లీ తింటారు. ఓట్ ఉప్మా కూడా కొన్నిసార్లు తీసుకుంటారు. మధ్యాహ్నం రాగి, జొన్న, సజ్జలతో చేసిన అన్నంతో పాటు రెండు లేదా మూడు కూరలు, కొంచెం పెరుగును తీసుకుంటారు. సాయంత్రంలోపు కొన్ని డ్రైఫూట్లు తీసుకుంటారు. సాయంత్రం వేళ సూప్ లేదా ఎగ్ వైట్ తీసుకుంటారు. రాత్రి ఏడు తర్వాత ఏమీ తినరు. పాలు తాగి పడుకుంటారు. ఈ విషయాలను చంద్రబాబే స్వయంగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. మందుల విషయానికొస్తే.. ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడు మధ్యలో మందులు వేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయన వెంటే వ్యక్తిగత వైద్యులు ఉంటారు. మావోయిస్టులు, రాజకీయ ప్రత్యర్థులు, ఇతర వర్గాల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పించింది. అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్‌లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుందనే భావనతో ఐదుగురితో భద్రతను కల్పించారు.