తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగింది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనేది వాస్తవం. ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల వాదన. ముఖ్యంగా 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం.. ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల ఓట్లు భారీగా క్రాస్ అయ్యాయి. మెజారిటీ స్థానాల్లో అధికార కాంగ్రెస్, బీజేపీనే ప్రధాన ప్రత్యర్థులు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ లాంటి చోట్ల ఓటరు నాడి విభిన్నంగా కనిపించింది.
ముందుగా తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాల వారీగా నమోదు అయిన పోలింగ్ శాతాన్ని లెక్కలతో సహా పరిశీలిస్తే… తెలంగాణలో గతంలో 60.57 పోలింగ్ శాతం నమోదు కాగా ఇప్పుడు 64.93 శాతం పోలింగ్ నమోదు అయింది. గ్రేటర్ లో ఏమాత్రం లేని మార్పు. పోలింగ్ శాతం పెరగలేదు. మహా అయితే కొసరు. హైదరాబాద్‌లో 46.08 శాతం పోలింగ్ నమోదు కాగా సికింద్రాబాద్ లో 48.11 శాతం మల్కాజ్ గిరిలో 50.12 శాతం, చేవెళ్లలో 55.45 శాతం.
జిల్లాల వారిగా పోలింగ్ శాతం..
ఆదిలాబాద్ లో 72.96 శాతం పోలింగ్ నమోదు కాగా భువనగిరిలో 76.47 శాతం,కరీంనగర్ లో 72.33 శాతం,ఖమ్మంలో 75.19 శాతం,మహబూబాబాద్‌లో 70.68 శాతం,మహబూబ్‌నగర్ లో 71.54 శాతం,మెదక్ లో 74.38 శాతం,నాగర్ కర్నూల్ లో 68.86 శాతం,నల్గోండలో 73.78 శాతం,నిజామాబాద్ లో 71.50 శాతం,పెద్దపల్లిలో 67.88 శాతం,వరంగల్ లో 68.29 శాతం,జహీరాబాద్‌లో 74.54 శాతం నమోదు కాగా…. అత్యధికంగా భువనగరిలో…76.47 శాతం అత్యల్పంగా హైదరాబాద్‌లో 46.08 శాతం ఓటింగ్ నమోదు అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో అయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతానికి.. ఇప్పటి ఓట్ల శాతానికి తేడా స్పష్టంగా కనిపించింది. ఈ నియోజకవర్గాల్లో కొందరు సిటింగ్ ఎంపీలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కేవలం వారి పార్టీ, కేంద్రంలో ఎవరు ఉండాలన్న దాని ఆధారంగానే ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల ఓటింగ్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ మినహా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అన్ని చోట్ల అధికార కాంగ్రె్‌సతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. మెదక్‌లో బీఆర్‌ఎ్‌సదే పైచేయి అవుతుందని, ఒక్క సిద్దిపేటలో వచ్చే మెజారిటీతోనే తాము బయటపడగలమని గులాబీ దళం భావిస్తోంది.
కానీ అక్కడ కూడా బీజేపీకే సానుకూల ప్రచారం (మౌత్ పబ్లిసిటీ) ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు. ఇక కరీంనగర్ పరిధిలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే సామాజికవర్గ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ.. వెలమ సామాజికవర్గంలో మెజారిటీ ఓట్లు కాంగ్రె్‌సవైపు వెళ్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, భువనగిరి, మహబూబ్‌నగర్ స్థానాల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఒకటి రెండు చోట్ల అధికార కాంగ్రెస్ ఓట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థులకు పోలైనట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం పరిధిలో కమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదనే కోపంతో కమ్మవాళ్లంతా బీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో.. తమ అభ్యర్థి ఎలాగూ గెలవడన్న అభిప్రాయంలో ఉన్న ఆ పార్టీ కేడర్, ఓటర్లు… బీజేపీవైపు మొగ్గు చూపారు. ఫలితంగా.. 2019తో పోలిస్తే కమలనాథులకు గణనీయంగా సీట్లు వచ్చే ఛాన్స్‌ను కొట్టేయలేము.
ఏదైమైనా సరే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అత్యంత కీలకమైనవి. తెలంగాణలో 17లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగితే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాతికమంది ఎంపీలతో పాటు, 175మంది ఎమ్మెల్యేలను కూడా ఎన్నుకొని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించుకోబోతున్నారు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఈ 4వ దశలో జరిగిన పోలింగ్‌లో దాదాపు సగం సీట్లు తెలుగురాష్ట్రాల్లోనే ఉన్నాయనేది కీలకం.