ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారి అయినా కాశీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు చూసి రావాలని గతంలో అనుకునేవారు. ఇప్పుడా జాబితాలో అయోధ్యలోని శ్రీరామమందిరం కూడా చేరింది. రాముడు నడియాడిన నేల… రామ జన్మభూమి… అయోధ్యలో అడుగుపెట్టి రావాలి… ఆ బాల రాముడిని దర్శించుకోవాలని అని కలలు కంటున్నారు. మరి అయోధ్యలో రాముడి దర్శనం ఎప్పటి నుంచి ఉంటుంది… ఏ టైమ్ లో దర్శనాలు ఉంటాయి… దర్శనానికి ఏవైనా నియమాలు ఉన్నాయా…
అయోధ్య శ్రీరామ మందిరంలో బాల రాముడు భక్తుల కోసం కొలువుతీరి ఉన్నాడు. బంగారువర్ణ పీతాంబరంతో చేతిలో బంగారు దణుర్భాణం… బంగారు పూలమాల… కస్తూరి తిలకం.. లలాట ఫలకే … ఇలా ఆ బాల రాముడిని ఎంత వర్ణించినా తక్కువే. ఆ రామయ్యను జనవరి 23 నుంచి సామాన్య భక్తులు కూడా సందర్శించుకోవచ్చని తీర్థ క్షేత్ర టస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. బాలరాముడిని దర్శించుకోడానికి కొన్ని నియమాలు, దర్శనం టైమింగ్స్ పాటించాలని సూచిస్తున్నారు.
ఆలయం ప్రాణప్రతిష్ట జరిగిన జనవరి 22 తెల్లారి నుంచే సామాన్య భక్తులకు దర్శనాలు ఉంటాయని ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం అయోధ్యలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రాణప్రతిష్ట కోసం… ఆహ్వానిత వీఐపీలతో పాటు స్వామీజీలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇంత రద్దీలో సామాన్య భక్తులు కూడా రాముడి దర్శనానికి వస్తే… ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే జనవరి 27 నుంచి దర్శనానికి వస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. బాల రాముడిని దర్శించుకోడానికి ఆలయంలో ఉచిత ప్రవేశమే ఉంది. స్పెషల్ దర్శనం లాంటి కావాలి అనుకుంటే మాత్రం ముందుగా టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ ఆన్‌లైన్‌లో తీర్థ క్షేత్ర వెబ్‌సైట్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి.. ఆఫ్‌లైన్‌లో కూడా అయోధ్యలో కౌంటర్లలో దొరుకుతాయి. అయితే ఈ టిక్కెట్లను దేవస్థానం ఇంకా రిలీజ్ చేయలేదు. దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి కూడా ఉచిత ప్రసాదాన్ని అందిస్తారు.
బాల రాముడి దర్శించుకోడానికి టైమింగ్స్ పెట్టారు. ఉదయం ఏడింటి నుంచి పదకొండున్నర వరకూ ఆ తర్వాత… మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అయోధ్యలో శ్రీరామ మందిరం తెరిచి ఉంటుంది. పండుగలు లేదా ఏవైనా ప్రత్యేక రోజులు ఏంటే… అప్పుడు టైమింగ్స్‌లో మార్పులు చేస్తారు. రాముల వారికి రోజుకి మూడు సార్లు హారతి ఇస్తారు. ఉదయం ఆరున్నరకు శృంతార్ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, సాయంత్రం ఏడున్నరకు సంధ్యాహారతి ఉంటాయి. ఈ హారతుల్లో పాల్గొనాలి అనుకునేవాళ్ళు వాళ్లు కూడా ప్రత్యేకంగా టికెట్ బుక్ చేసుకోవాలి. కొంతమందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
శ్రీరామమందిరంలోకి వెళ్లే భక్తులు కచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలి. మగవాళ్ళయితే ధోతీ లేదంటే కుర్తా – పైజామా వేసుకోవాలి. మహిళలైతే .. చీర లేదా సల్వార్, చుడీదార్ వేసుకోవాలి. దుపట్టా కచ్చితంగా వేసుకోవాలి. ఆలయంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్ళడానికి అనుమతి ఉండదు. పర్సులు, హ్యాండ్‌బ్యాగ్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఏవీ కూడా గుడిలోకి తీసుకెళ్లరాదు. గొడుగులు, బ్లాంకెట్స్, గురుపాదుకలు లాంటి వస్తువులను కూడా అనుమతించబోమని ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.
అయోధ్యకు వెళ్ళాలంటే రోడ్డు, రైలు, ఫ్లైట్… ఇలా మూడు మార్గాలు ఉన్నాయి. మహర్షి వాల్మికి పేరున ఎయిర్‌పోర్ట్ కూడా నిర్మించారు. ఎయిర్ పోర్ట్ తో పాటు అయోధ్య రైల్వే జంక్షన్‌ని ప్రధాని మోడీ ఈమద్యే ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్ళు, విమాన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయోధ్యకు ప్రస్తుతం బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయి. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి కూడా అయోధ్యకు రైళ్ళను నడుపుతోంది ఇండియన్ రైల్వే. ప్రతి రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు.