ఏం నడుస్తోంది అంటే.. వలసలు నడుస్తున్నాయ్ అంటున్నారు తెలంగాణలో ! కారు పార్టీ నుంచి గంపగుత్తగా నేతలు.. హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. నయానో భయానో.. మరెలానో కానీ.. బీఆర్ఎస్ (BRS) నేతలను వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ (Congress) పెద్దలు. పట్నం, రంజిత్ రెడ్డి నుంచి లేటెస్ట్‌గా కడియం వరకు.. అందరిదీ ఇదే దారి. ఐతే బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే టార్గెట్ అన్నట్లు కనిపిస్తున్న కాంగ్రెస్.. బీజేపీ మాత్రం అసలు టచ్ చేయడం లేదు. టచ్ కాదు కదా.. ఆ ఆలోచన వచ్చినా రేవంత్ సర్కార్ ఉండదు అంటూ కమలం పార్టీ నేతలు బహిరంగంగానే రియాక్ట్ అవుతున్నారు.
ఐతే బీజేపీ (BJP) ని కాంగ్రెస్, రేవంత్ ఎందుకు టచ్ చేయడం లేదు. కమలం పార్టీ అంటే భయమా.. వేరే కారణం ఏదైనా ఉందా.. ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడు! బీజేపీ నేతల్లో ఎవరైనా తమంతట తాముగా బయటకు వచ్చేస్తే మాత్రమే.. చేర్చుకుంటున్నారు తప్ప.. నేతను టార్గెట్ చేసి విధంగా లాక్కునే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. మోదీ, షా వ్యూహాలతో విపక్షాలు అల్లాడిపోతున్నాయ్. కాంగ్రెస్ అయితే ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ (Telangana BJP)ఎమ్మెల్యేలను టచ్ చేస్తే ఇక అంతే సంగతి అనే భయం హస్తం పార్టీ పెద్దలను వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.
బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ.. ఇక్కడి నేతలను టార్గెట్ చేయడం ఖాయం. మోదీ సర్కార్‌తో కయ్యం పెట్టుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో బీఆర్ఎస్‌ను చూస్తే అర్థం అవుతుంది. అలాంటిది ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేస్తే.. కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలు ఉంటాయనే భయం.. కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రేవంత్‌పై ఓటుకు నోటు కేసుతో సహా చాలామంది తెలంగాణ కాంగ్రెస్ పెద్దలపై రకరకాల కేసులు ఉన్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జోలికి కాంగ్రెస్ వెళ్లే చాన్సే లేదనే చర్చ జరుగుతోంది.