వరల్డ్‌కప్‌కి టైమ్ దగ్గరపడుతున్నా ఇప్పటివరకు టీమిండియాకు ఓపెనర్లు ఎవరో బీసీసీఐకే తెలియడంలేదంటే నమ్మగలరా? అలా ఏడ్చింది ప్రస్తుతం మన పరిస్థితి. అనామక జట్లను ఓడించేసి మెగా లీగ్స్‌లో కీలక మ్యాచ్‌ల్లో చతకిలపడడం మనకు అలవాటే కదా.. ఇక వరల్డ్‌కప్‌కి ముందు జరుగుతున్న ఆసియా కప్‌ను టీమిండియా ప్రాక్టీస్‌గా భావిస్తోంది. వరల్డ్‌కప్ ముఖ్యం అనే సాకుతో అడ్డమైన ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా ఐదో పొజిషన్‌లో బ్యాటింగ్ చేయని ఇషాన్‌కిషన్‌ని అదే స్థానంలో బరిలోకి దిగామని టీమ్ మేనేజ్‌మెంట్ ఈ యువ క్రికెటర్‌ని కోరినట్టు తెలుస్తోంది.
నిజానికి ఓపెనర్లగా రోహిత్, ఇషాన్ బరిలోకి దిగుతారని.. వన్‌డౌన్‌లో కోహ్లీ కాకుండా గిల్ బ్యాటింగ్‌కి వస్తాడని.. విరాట్ నంబర్-4లో దూకుతాడని ప్రచారం జరిగింది. అయితే ఆసియా కప్‌కి ముందు ఇంటర్నెల్‌గా జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లు చూస్తే ఇదంతా నిజం కాదనిపిస్తోంది. ఎందుకంటే ఇషాన్‌కిషన్‌ని నంబర్-5లో ఆడించేలా జట్టు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఓపెనర్లగా రోహిత్-గిల్, కోహ్లీ ఎప్పటిలాగే నంబర్-3, నంబర్-4లో శ్రేయర్ అయ్యర్, నంబర్-5లో ఇషాన్‌ని ఆడించాలని హెడ్ కోచ్ ద్రవిడ్ ప్రణాళికలు రచించినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇషాన్ నంబర్-5లో ఒక్కటంటే ఒక్కసారి కూడా ఆడింది లేదు. అతనికి ఓపెనింగ్ మాత్రమే సెట్ అవుతుంది. వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చే అతని డబుల్ సెంచరీ బాదాడు.
ఇప్పడు చేస్తున్న ప్రయోగాలు వన్డే ప్రపంచ కప్ కోసమేనని ద్రవిడ్ అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. అంటే ఇషాన్‌ని నంబర్-5లో వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడించాలని టీమ్ భావిస్తుందా? కేవలం ఒక్క టోర్నీలో ఆ స్థానంలో బరిలోకి దింపి నేరుగా..అనుభవం లేకుండా ప్రపంచ కప్‌లో అదే స్థానంలో ఎలా బ్యాటింగ్‌కి దింపుతారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాయంతో ఉండడంతోనే ఇషాన్‌ని ఆడిస్తున్నారని కానీ.. కేఎల్ తిరిగి టీమ్‌లోకి వచ్చిన తర్వాత అసలు ఇషాన్ తుది జట్టులో ఉండడు కదా.. మరెందుకీ డిస్కషన్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఇది నిజమే కావొచ్చు.. కానీ రాహుల్ మళ్లీ గాయపడొచ్చు.. లేకపోతే ఫామ్‌లేక తంటాలూ పడొచ్చు.. అప్పుడు ఇషానే దిక్కు కావొచ్చు.. చాలా పాజిబిలిటిస్ ఉన్నప్పుడు ఇలా నంబర్-5లో అతడిని బ్యాటింగ్ చేయమనడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. పవర్‌ప్లేలో ఎక్కువగా పరుగులు రాబట్టే ప్లేయర్ ఇషాన్. బౌండరీలపైనే అతడి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. మిడిలార్డర్‌లో సింగిల్స్, డబుల్స్‌తో పాటు స్లాగ్ ఓవర్లలో భారీ హిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఆడుతున్న ఇషాన్.. ఈ రోల్‌లో సెట్ అవుతాడా అంటే డౌటే!