Gujrat: వరద ధాటికి మునిగిన ఎల్ పీ జీ గోడౌన్.. కొట్టుకు పోయిన గ్యాస్ సిలిండర్లు

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సామాన్యుల మొదలు సంపన్నుల వరకూ అందరూ సతమతమౌతున్నారు. మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. రహదారులన్నీ బీటలు వాటిల్లినపరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా ఒక వాహనం సిలిండర్ లతో పాటూ కొట్టుకొని పోయిన ఘటన అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 07:45 PM IST

ఉత్తరభారతం వర్షానికి వణుకుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలో పరిస్థితి అస్థవ్యస్థంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో యమునా ఉధృతి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుంది. హిత్నికుండ్ బ్యారేజ్ నుంచి నదిలోకి పైనుంచి వస్తున్న వరదనీటిని ఇరిగేషన్ అధికారులు యమునా నదిలోకి విడుదల చేస్తున్నారు. యమునా నదికి వరద తీవ్రత పెరగడంతో మరోసారి దేశ రాజధాని ఢిల్లీ నీళ్లల్లో దిగ్భందం అయిపోయింది. నగరవాసులు భయం గుప్పెట్లో బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇదిలా ఉంటే గుజరాత్ లోని నవ్సారి ప్రాంతంలో ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఇంటింటికి సిలిండర్లు అందించేందుకు సరికొత్త ప్రయోగాన్ని చేశారు అని కామెంట్లు పెడుతున్నారు. ఒక ఎల్ పీ జీ సిలిండర్లను భద్రపరిచే గోడోన్ కు వరదలు ముంచెత్తడంతో అందులోని గ్యాస్ బండలు నీటిలో కొట్టుకుపోవడానికి ప్రదాన కారణంగా చెబుతున్నారు స్థానికులు. రానున్న 24 గంటల్లో గుజరాత్ తో పాటూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు బరిలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

T.V.SRIKAR