Traffic In Hyderabad: కిలోమీటర్లమేర ట్రాఫిక్‌.. హైదరాబాద్‌ రోడ్లపై నరకయాతన..

నాన్‌స్టాప్ వర్షాలు.. హైదరాబాద్‌వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్. ఎక్కడ ఏ డ్రైనేజీ ఉందో.. ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ చెట్టు విరిగిపడుతుందో అనే భయం.. ఇళ్లు వదిలి అడుగు బయటపెట్టకుండా చేస్తున్నాయ్.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 06:05 PM IST

అక్కడా ఇక్కడా కాదు.. హైదరాబాద్‌లో అడుగడుగునా వర్షం పడుతోంది. బేగంపేట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, ఎస్ఆర్‌ నగర్‌, మోతీ నగర్‌, కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వర్షం కురుస్తోంది. మాములు సమయాల్లోనే ఇక్కడి రోడ్లు నరకం అంటే.. నాన్‌స్టాప్ వర్షాలతో మరింత మరింత దారుణంగా తయారయింది. హైటెక్ సిటీ ఐకియా సెంటర్‌ దగ్గర.. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

చాదర్‌ఘాట్‌, మలక్‌పేట దగ్గర జాతీయ రహదారి 65 పై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయ్.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాహనాలన్నీ నత్తతో పోటీ పడుతున్నాయ్. గంటలకు గంటలు రోడ్డు మీద గడుస్తున్న పరిస్థితి. రోడ్లపై భారీగా వరదనీరు చేరుకోవడంతో.. వాహనాలు ముందుకు కదలడం ఇబ్బందిగా మారుతోంది. ఇక రోడ్లపై నిలిచిన నీటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు కూడా శ్రమించాల్సి వస్తుంది. రోడ్ల మీద ట్రాఫిక్ ఇలా ఉంటే.. చెట్లు విరిగిపడిన చోట విద్యుత్‌ అంతరాయంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.