October Heat: అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు.. కారణాలు ఏంటి.. ఎప్పటి వరకూ ఇలా..?

సెప్టెంబర్ కాస్త చల్లని వాతావరణంతో ముగిసినప్పటికీ.. అక్టోబర్ మాత్రం దీనికి భిన్నంగా ఉండబోతుంది. ఇప్పటికే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల ప్రజలపై తీవ్రంగా చూపుతోంది. దీనికి గల కారణాలు ఏంటి.. ఎప్పటి వరకూ ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయో ఇప్పడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - October 15, 2023 / 11:19 AM IST

ఎండలు బాబోయ్ ఎండలు.. దసరా వచ్చిందంటే ఒకప్పుడు చలికి వణికి పోయేవాళ్లం అని మన ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ పరిస్థితి వీటికి భిన్నంగా ఉంది. మంచుగడ్డను సైతం మంచినీటిలా కరిగించే వేసవి తాపం పెరిగిపోయింది. ఉదయం నుంచి ఉష్టోగ్రతలు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. 10 గంటలకు ఆఫీసుకు వెళ్లాలంటే సూర్యుడు మండిపోతున్నాడు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక హైదరాబాద్ ట్రాఫిక్ వాసుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. సిగ్నళ్ళ దగ్గర ఆగితే ఒకవైపు కార్ల ఇంజన్ వేడి, మరో వైపు భానుడి భగభగలతో చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. ఆగస్ట్ – సెప్టెంబర్ లో దంచి కొట్టిన వానలు అక్టోబర్లో కనిపించడం లేదు. దీనికి కారణాలు ఇప్పుడు చూద్దాం.

మండే ఎండలకు కారణాలు ఏంటి..

గడిచిన 10 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం స్థాయి కంటే కూడా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మనకు అక్టోబర్ మొదలవగానే మన్నటి వరకూ ఉన్న నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య రుతువుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఇప్పుడు మనకు కొనసాగుతున్న ఈ పరిస్థితులను అక్టోబర్ హీటింగ్ గా పేర్కొన్నారు. ఇలా నైరుతి వెళ్ళి ఈశాన్య గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో పీడనం అధికంగా కొనసాగే అవకాశం ఉంటుంది. తద్వారా భూ ఉపరితలంపైకి తేమ గాలులు అధికంగా వీచి వర్షాలు పడేలా చేస్తుంది.అయితే ఈ సంవత్సరం దీనికి భిన్నంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. మన భారతదేశానికి మధ్య భాగంలో అధిక పీడనం ఏర్పడి ఆ గాలులు భూ ఉపరితలంపై నుంచి వీస్తుండడంతో గాలిలో తేమ శాతం పూర్తిగా తగ్గిపోయింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడివాతావరణం అధికంగా పెరిగిపోయింది. అందుకే ఈ వేసవి కాలం ఎండలకు కారణమౌతోంది.

వర్ష సూచన తక్కువే..

తాజాగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర తెలంగాణ నుంచి పూర్తిగా వెళ్లిపోయే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంతకు ముందు చెప్పుకున్న అధిక పీడనం కారణంగా వెనువెంటనే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం తక్కువగా ఉంది. ఒకవేళ ఇవి ప్రవేశించినప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. పైగా బంగాళాఖాతంలో అక్టోబర్ 19 వరకూ ఎలాంటి ఉపరితల ఆవర్తనాలు కొనసాగడం లేదని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. అయితే ఈనెల 20, 21 తేదీల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. దీని ప్రభావంతో చల్లని తేమ గాలులు ఇటుగా వీచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అప్పటి వరకూ భానుడితో సహవాసం చేయకతప్పదని చెబుతున్నారు. ఈ సారి కరీఫ్ రైతులకు గడ్డుకాలమనే చెప్పాలి.

T.V.SRIKAR