దొంగలు బాబోయ్‌ దొంగలు.. టమాటాలు ఎత్తుకెళ్తున్నారు..

టమాటతో కూర వండుకున్నారంటే.. వాళ్లు ఉన్నొళ్లే అనుకునే స్థాయికి పెరిగాయ్ వీటి ధరలు. దేశవ్యాప్తంగా టమాట ధరలు దూసుకుపోతున్నాయ్. కిలో 150 రూపాయల పైనే పలుకుతోంది.

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 01:31 PM IST

కొన్ని చోట్ల అయితే డబుల్ సెంచరీ దాటేసింది. అన్నీ కూరగాయల ధరలు దాదాపు ఇలానే ఉన్నాయ్.. అందులో టమాట టాప్ లేచిపోతోంది. తప్పదు అనుకుంటే తప్ప.. టమాట వైపు కూడా చూడడం లేదు జనాలు. టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. దొంగలు రెచ్చిపోతున్నారు. తమ చేతి వాటం చూపిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఇలాంటి చోరీలు పెరిగిపోతున్నాయ్. కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ మహిళా రైతు టమాటా పండించింది. ధరలు పెరగడం వల్ల మంచి ఆదాయం వస్తుందని సంబరపడింది. పంటకోసి మార్కెట్‌కి తీసుకెళ్దామని చూసే లోపు.. ఒక్క కాయ కూడా కనిపించలేదు. అంతా దొంగల పాలైంది. దాదాపు రెండున్నర లక్షల విలువైన టమాటాలను ఎత్తుకెళ్లారు దుండగులు.

తెలంగాణలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లోని మార్కెట్‌లో టమాటాతో పాటు పచ్చిమిర్చి బాక్సులు చోరీకి గురయ్యాయ్. అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించిన పోలీసులు.. ఇది దొంగతనమే అని తేల్చారు. టమాట ధరలే కాదు.. పచ్చిమిర్చి కూడా కొరకకుండానే మంట పుట్టిస్తోంది. 2వందలకు అటు ఇటుగా కిలో పచ్చి మిర్చి ధర పలుకుతోంది. టమాటా ధరలు మరో రెండు మూడు నెలల వరకు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జనాలే కాదు.. పండించిన రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. ఎలా కొనాలో తెలియక జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు టెన్షన్ పడుతున్నారు. ఐనా టమాటాలు ఎత్తుకెళ్లడం ఏంటి.. వీళ్ల మొహాలు టమాట సూప్‌లో పడెయ్యా.. కలికాలం మహిమ అంటూ ఈ చోరీ వార్తలు చూసి నెటిజన్లు జోకులు వేస్తున్నారు.