ఇక అటు దేశ రాజధాని ఢిల్లీకి కూడా వరద ముప్పు కనిపిస్తోంది. 41ఏళ్ల తర్వాత రికార్డుస్థాయిలో వర్షాలు కురవడంతో.. వరద ముప్పు భయపెడుతోంది. దీనికి సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. 24 గంటల వ్యవధిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది అక్కడ. 1982 జూలై తర్వాత ఆ స్థాయిలో ఢిల్లీలో వర్షపాతం నమోదుకావడం ఇదే మొదటిసారి. మరో రెండు రోజులు వాన ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్‌లు, ఆసుపత్రి ప్రాంగణాలు నీట మునిగాయి, రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఢిల్లీవాసులకు వర్షాలు.. కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్. ఇక అటు భారీ వర్షాలకు యమునా నది పొంగి ప్రవహిస్తోంది. హర్యానా ప్రభుత్వం లక్ష క్యూసెక్కుల నీటిని.. విడుదల చేయడంతో ఈ నదిలోకి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారానికి ఆ నీరు ఢిల్లీకి చేరి, నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటేస్తుందని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. దీంతో వివిధ విభాగాల అధికారుల్ని అప్రమత్తం చేసి 16 కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నిజానికి దక్షిణాదిలో నైరుతి రుతుపవనాలు ముందుగా ప్రభావం చూపుతుంటాయి. ఐతే ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకుంది. దక్షిణాది రాష్ట్రాలు చినుకు జాడ కరువై కలవరపడుతుంటే.. ఉత్తర భారతంలో వరుణుడు జలవిలయం సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ మొదలు లడఖ్ వరకు తన ప్రతాపం చూపిస్తున్నాడు.