Rain Alert: తెలంగాణలో 5 రోజులు వానలే వానలు.. బీ అలర్ట్‌

నైరుతి పలకరింపుతో.. ప్రకృతి పులకరిస్తోంది. నిన్నటివరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రాణాలు.. తొలకరి పలకరింపులతో సేద తీరుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 05:37 PM IST

నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం తోడు కావడంతో.. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని.. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. 26,27 తేదీల్లో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయ్. ఉత్తర తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.

హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పగలు అంతా సాధారణ పరిస్థితి ఉన్న.. సాయంత్రానికి వెదర్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్. తెలంగాణ మీదుగా దక్షిణ జార్ఖండ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేల సంఖ్యలో పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు.