చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ గెలుపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ , శుభ్ మన్ గిల్ , అశ్విన్, జైశ్వాల్ రాణించగా.. అంచనాలు పెట్టుకున్న కోహ్లీ, రోహిత్ విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్ లలోనూ నిరాశపరిచారు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తున్నా బ్యాటింగ్ కు కష్టంగా అయితే కనిపించలేదు.
దీంతో వీరిద్దరిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ, రోహిత్ లు దులీప్ ట్రోఫీ ఆడి ఉండాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా గత ఐదేళ్లలో పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదని , చాలా మ్యాచులకు దూరంగా ఉన్నారనీ గుర్తు చేశాడు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఆడలేదనీ, అప్పుడు ఆడి ఉంటే, ఇప్పుడు ఈ ఇబ్బంది వచ్చేది కాదని విశ్లేషించాడు.
ఎందుకంటే నెలన్నర బ్రేక్ తర్వాత వచ్చి, బ్యాటింగ్ చేయాలంటే ఆ మూడ్‌లోకి రావడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ విషయంలో ఇదే జరిగిందని అంచనా వేశాడు. చెన్నైలాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయాలంటే ప్రాక్టీస్ చాలా అవసరమన్న మంజ్రేకర్ పిచ్ ఎలా ఉండబోతుందో రోహిత్‌కి బాగా తెలుసన్నాడు. మొదటి గంట బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని, క్రీజులో సెటిల్ అవ్వడానికి టైమ్ తీసుకోవాలని సూచించాడు. ఇక దులీప్ ట్రోఫీలో ఆడిన గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డకౌటైనా రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టాడు.