ఇందిరమ్మ ఇళ్ళ (Indiramma Houses) నమూనాల్లో ఇక డూప్లెక్స్ ఇళ్లు కూడా కనిపించబోతున్నాయి. రాష్ట్రంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. జాగా ఉన్న పేదలు ఇళ్ళు కట్టుకోడానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుంది. ఈ ఇళ్ళకు సంబంధించి నమూనాలను తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు నిర్మించాలంటే 60 గజాల స్థలం కావాలి. అంత స్థలం లేని పేదల పరిస్థితి ఏంటి… చాలామంది మందిలో ఇదే ఆందోళన కనిపిస్తోంది. దాంతో 60 గజాల లోపే స్థలం ఉన్నవారికి… డూప్లెక్స్ తరహాలో ఇళ్ళు నిర్మించాలని పేదలు కోరుతున్నారు. దిగువ అంతస్తులో కొన్ని గదులు, పై ఫ్లోర్ లో కొన్ని గదులు నిర్మించాలి. అలాగైనే చాలామంది పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు పథకం అందుతుంది. లేకపోతే అవకాశాలు కోల్పోయే వాళ్ళే ఎక్కువగా ఉంటారు.
గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు చిన్నవిగా ఉండటంతో ఈసారి కాస్తంత విశాలంగా ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ నిర్ణయించింది. ప్రతి ఇంట్లో విడిగా వంటగదితో పాటు టాయిలెట్ నిర్మించాల్సిందేనని నిర్ణయించారు. ఇవి కాకుండా మరో రెండు గదులు ఉండాలి. ఈ లెక్క ప్రకారం కనీసం 400 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. అంటే 60 గజాలు స్థలం అవసరం. అంతకంటే తక్కువగా 30 గజాల లోపు స్థలం ఉన్న పేదలు చాలామంది అర్హలుగా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఎలా కట్టాలి. ఇరుకు ఇంటిని నిర్మించడం కంటే… డూప్లెక్స్ తరహాలో ఇల్లు కడితే బెటర్ అన్న ఉద్దేశ్యం చాలామంది లబ్దిదారుల్లో వ్యక్తమవుతోంది. డూప్లెక్స్ ఇంట్లో పైన బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకొని… కింద వంటిల్లు, హాలు, టాయిలెట్ నిర్మించుకుంటామని చాలామంది చెబుతున్నారు. దాంతో ప్రభుత్వం కూడా ఈ నమూనా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.