AP Volunteers: ఏపీలో వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు విధులకు దూరంగా ఉండాలని, పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆదేశించింది. సంక్షేమ పథకాల అమలులో జోక్యం చేసుకోవద్దని సూచించింది. దీనిపై ఏపీ సీఈవోకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధించాలని కోరుతూ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ గత ఫిబ్రవరిలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.
PUSHPA 2 TEASER: బర్త్ డేకి 2 రోజుల ముందే.. ఐకానిక్ గిఫ్ట్..
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మార్చి 13న ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీ.. తాజాగా వాలంటీర్ల విధులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు తమ విధులకు దూరంగా ఉండాలి. సంక్షేమ పథకాల నగదు పంపిణీని దూరం పెట్టాలి. వాలంటీర్లు ఉపయోగించే మొబైల్, టాబ్లెట్, ఇతర పరికరాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకూ జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలి. సంక్షేమ పథకాల అమలుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పథకాల అమలు, నగదు పంపిణీకి ఇతర ప్రభుత్వ ఉద్యోగులను వాడుకోవడం లేదా ఆన్‌లైన్ ద్వారా నేరుగా పంపిణీ చేయాలని సూచించింది. గతంలో కూడా ఈసీ.. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల విధులపై పలు ఆంక్షలు విధించింది.
వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించవద్దని ఆదేశించింది. అలాగే.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే వాలంటీర్లపై ఎన్నికలకు సంబంధించి పలు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల వాలంటీర్లు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో కొందరిని ఈసీ సస్పెండ్ చేసింది.