Sharad Pawar: శరద్ పవార్‌కు షాక్.. అజిత్ పవార్‌దే ఎన్సీపీ.. ఈసీ నిర్ణయం

అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది.

  • Written By:
  • Updated On - February 7, 2024 / 01:24 PM IST

Sharad Pawar: రాజకీయ కురువృద్ధుడు అజిత్ పవార్‌కు షాక్ తగిలింది. ఆయన స్థాపించిన ఎన్సీపీని అజిత్ పవర్ వర్గానికి కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)లో చీలికలు వచ్చిన సంగతి తెలిసిందే. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ పవార్.. పార్టీలో చీలిక తెచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే ఆధ్వర్యంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది శరద్ పవార్ వర్గం. పార్టీని, గుర్తును తమకే కేటాయించాలని కోరింది.

REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్

దీనిపై ఈసీ దాదాపు ఆరు నెలలు విచారణ జరిపింది. అజిత్, శరద్ పవార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో దాదాపు పదిసార్లు ఈసీ చర్చలు జరిపింది. వారి వివరణలు తీసుకుంది. చివరకు.. పార్టీ అజిత్ వర్గానికే చెందుతుందని నిర్ణయం తీసుకుంది. పార్టీతోపాటు గుర్తును కూడా అజిత్ వర్గానికే కేటాయించింది. దీంతో శరద్ పవార్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 రూల్ 39AAకి లోబడి శరద్ పవార్ వర్గం.. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. అజిత్ వర్గం ఎమ్మెల్యేలతోపాటు, శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు కూడా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. మహారాష్ట్ర నుంచి 6 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, పార్టీని అజిత్‌కు కేటాయించినప్పటికీ.. తమకు కొత్త పార్టీ పేరు, గుర్తు ఎంపిక చేసుకోవడానికి అవకాశం దక్కకపోవడంపై శరద్ పవార్ వర్గం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై శరద్ వర్గం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మహారాష్ట్రతోపాటు జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్ కీలక పాత్ర పోషించారు.

గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. అయితే, 1999లో నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయతను ప్రశ్నిస్తూ పార్టీ నుంచి బయటకు వచ్చి, ఎన్సీపీని స్థాపించారు. అప్పటి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ పోటీ చేసింది. తిరిగి 1999లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అనంతరం 2004 నుంచి 2014 వరకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎన్సీపీ భాగస్వామిగా ఉంది. శరద్ పవార్ కేంద్ర మంత్రిగా పని చేశారు. అయితే, ఆయన స్థాపించిన ఎన్సీపీ ఇప్పుడు అజిత్ వర్గానికి వెళ్లిపోవడం పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.