YS JAGAN: ఏపీ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై జగన్ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఈసీ స్పష్టం చేసింది. జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సిద్ధం సభల్లో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు.
YS SHARMILA: రాష్ట్రంలో అప్పులేని రైతున్నాడా.. జగన్ ఒక్క హమీ అయినా నెరవేర్చాడా: వైఎస్ షర్మిల
జగన్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని వర్ల రామయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. వైఎస్ జగన్‌కు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై జగన్ 48 గంటల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది. ఇటీవల సిద్ధం సభలో చంద్రబాబును జగన్ పశుపతితో పోల్చారు. మోసం చేయడమే చంద్రబాబుకు అలవాటన్న జగన్.. బాబును అరుంధతి సినిమాలో పశుపతితో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు.. ఇంతకుముందే చంద్రబాబుకు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసింది. సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అని చంద్రబాబు మాట్లాడారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో ఈసీ చంద్రబాబుకు నోటీసులిచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ సూచించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. వ్యాఖ్యలు చేసినందుకుగాను చంద్రబాబుతోపాటు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు, వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డికి కూడా ఈసీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సందర్భంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు చేయకూడదు. పరిమితులను అతిక్రమించే అసభ్యకరమైన పదజాలం వాడకూడదు. దుర్భాషలాడటం, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా పరిధిదాటి మాట్లాడటం వంటివి చేయకూడదు.