Lok Sabha Elections 2024: దేశంలో ఎన్నికలు అంటే ధన ప్రవాహమే. గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అందుకే అడ్డదారుల్లో డబ్బు తరలించేందుకు ప్రయత్నిస్తుంటారు నేతలు. అలాంటి డబ్బు చాలా వరకు పట్టుబడుతుంటుంది. అలా ఇటీవలి కాలంలో పట్టుబడ్డ డబ్బు వేల కోట్లలో ఉంది. గడిచిన 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.4,658 కోట్ల విలువైన సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే.. సగటున రోజుకు రూ.100 కోట్లకుపైగా సొమ్ము దొరికింది.
Mahesh Babu: మహేష్ రిస్క్.. స్కేటింగ్ నేర్చుకుంటున్న మహేష్ బాబు
అయితే, ఇది పూర్తిగా నగదు కాదు. ఇందులో నగదు డబ్బు రూ.395.39 కోట్లు మాత్రమే. మిగతా వాటిలో రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.1,142 కోట్ల విలువైన ఇతర కానుకలు, రూ.2068.85 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో డ్రగ్స్ విలువే ఎక్కువ (45 శాతం). ఈ స్థాయిలో అక్రమ సొమ్ము పట్టుబడటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఎన్నికల సంఘం తెలిపింది. 2019 ఎన్నికల సమయంలో మొత్తం కలిపి పట్టుబడ్డ సొమ్ము విలువ రూ.3,475 కోట్లు. గత ఎన్నికలకంటే ఇది 33 శాతం అధికం. మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 వరకే ఈ సొమ్ము దొరికింది. అయితే, ఈసారి ఎన్నికలకు ఇంకా నెలకుపైగా టైం ఉంది. అయినప్పటికీ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ సొమ్ము ఇప్పటికే పట్టుకున్నారంటే.. ఈసారి అక్రమ సొమ్ము ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు అత్యధిక సొమ్ము స్వాధీనం చేసుకుంది రాజస్థాన్‌లో. అక్కడ రూ.778 కోట్ల విలువైన సొమ్ము దొరికింది.
ఏపీలో 125 కోట్లు, తెలంగాణలో రూ.121 కోట్లు దొరికింది. అత్యల్పంగా జమ్ము-కాశ్మీర్‌లో రూ.4 కోట్లు మాత్రమే దొరికాయి. గత జనవరి నుంచి అనేక తనిఖీల్లో రూ.12 వేల కోట్ల విలువైన సొత్తు దొరికింది. పట్టుబడ్డ నగదు, బంగారం, ఆభరణాలు, సామగ్రికి సంబంధించి అన్నీ.. ఎన్నికల్లో పంచేందుకే తీసుకెళ్తున్నారని చెప్పలేం. ఎందుకంటే కొన్ని సరైన లెక్కపత్రాలు లేకుండా తీసుకువెళ్లేవి కూడా ఉన్నాయి. ఎన్నికల్లో డబ్బుతోపాటు మద్యం, బంగారం, వెండి, చీరలు, ఎలక్ట్రానిక్స్ వంటి కానుకలు పంచుతుంటారు. అలాగే డ్రగ్స్ కూడా సరఫరా చేస్తుంటారు. వాటన్నింటిపై నిఘా పెట్టిన ఎన్నికల సంఘం.. పోలీసులు, భద్రతా బలగాలతో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటుంది.