MLC KAVITHA: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కవిత నివాసంతోపాటు ఆమె భర్తకు చెందిన వ్యాపారసంస్థలపైనా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఈ సోదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంటుంది. మొత్తం నాలుగు బృందాలుగా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల రేపే.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా
ఈ సోదాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా కవిత నివాసంలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనపై మోపిన అభియోగాల విషయంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఈ నెల 19న జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే రెండు మూడుసార్లు కవితను ఈడీ విచారించింది.
ఆ తరువాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. అయితే, తనను విచారించకుండా చూడాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు ఆధారంగా ఈడీ.. ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక్క రోజు ముందు.. ఈడీ దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా కేంద్రం కక్ష సాధింపు చర్యలో భాగంగా జరుగుతోందని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.