సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. తాజాగా మరోసారి ఆమెకు ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రేపు(శుక్రవారం) విచారణకు రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు అందించిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో కేసీఆర్ కుమార్తె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందోననే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కాంలో దినేష్ అరోరా, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, శరత్ చంద్రా రెడ్డి అప్రూవర్లుగా మారారు. చివరిసారిగా లిక్కర్ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో కవితను విచారించిన ఈడీ.. 6 నెలల గ్యాప్ తర్వాత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు మళ్లీ యాక్టివిటీని మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.
కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు దర్యాప్తులో స్పీడ్ ను పెంచినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో తెలంగాణకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ తాజాగా సెప్టెంబరు 6న (బుధవారం) విచారించింది. ఆ రోజున ఉదయం నుంచి రాత్రి 6.15 గంటల వరకూ బుచ్చిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితకు తాజాగా ఇవాళ ఈడీ నోటీసులు పంపి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు ఆగస్టు చివరివారంలోనూ ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు తెలుగువారిని ఈడీ ఢిల్లీకి పిలిపించి ఇంటరాగేట్ చేసింది.
అయితే దాదాపు మూడు నెలల పాటు లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రస్తావనకు రాలేదు. దీంతో కవితకు క్లీన్ చిట్ వచ్చినట్లేనని వార్తలు గుప్పుమన్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ కు కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే.. ఈ కేసులో దర్యాప్తు విషయంలో ఈడీ జోరును తగ్గించిందనే ప్రచారం వినిపించింది. అయితే తాజాగా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ముసాయిదా ప్రతిని రూపొందించడం నుంచి శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మద్యం వ్యాపారంలో ప్రవేశపెట్టేంతవరకూ కీలక పాత్ర పోషించానని ఈడీ ఎదుట బుచ్చిబాబు ఒప్పుకున్నారని తెలుస్తోంది. 2021 జూన్‌లో బుచ్చిబాబు.. అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లైతో కలిసి న్యూఢిల్లీలోని విజయగౌరి అపార్ట్‌మెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌తో చర్చలు జరిపారు. తర్వాత ఐటీసీ కోహినూర్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, తాజ్ మాన్‌సింగ్ హోటల్, ఒబెరాయ్ హోటల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కీలక సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఇన్ని ఆధారాలు ఉండటం, కేసులో బుచ్చిబాబు వాంగ్మూలం కీలకం అవుతుండటంతో ఇప్పుడే అసలు సీన్ మొదలైందని.. మున్ముందు ఇంకా చాలా వరకూ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.