మనదేశంలో రోజుకో కొత్త కట్టడం పుట్టుకొస్తుంది. మన స్థానికంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చూసుకుంటే కేబుల్ బ్రిడ్జ్ మొదలు స్కైవాక్ వరకూ గొప్ప కట్టడాలు నిర్మించారు. ఇక మనదేశ రాజధాని విషయానికొస్తే ఎప్పటి నుంచో చారిత్రాత్మక నిర్మాణాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇండియా గేట్ మొదలు.. రెడ్ ఫోర్ట్ వరకూ. ఇక తాజాగా మరో నవ నిర్మాణం ప్రాణం పోసుకుంది. ప్రయాణీకుల సౌకర్యం కొరకు సేవలు అందిస్తుంది. అదే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది ఇండియాలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ గా పేరుగాంచింది. అలాంటి విమానాశ్రయంలో మరో కొత్త నిర్మాణం ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే పేరుతో రూపుదిద్దుకుంది. ఈ రన్ వే ను పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం ప్రారంభించారు. దీని విశేషం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొత్తగా ప్రారంభించిన ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే లో కింద ఉండే రోడ్డు మార్గంతో పాటూ పైనుంచి వంతెన మార్గం ఉంటుంది. ఇందులోని దారులు ఎయిర్ పోర్ట్ లోని టర్మినల్స్, హ్యాంగర్లను కలుపుతూ పోతుంది. ఇలా విమానాశ్రయంలోని ప్రదాన ప్రాంతాలను అనుసంధానం చేసే వాటిని టాక్సీవేలు అంటారు. ఇది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఉత్తర, దక్షిణ ఎయిర్ ఫీల్డ్ లను కలుపుతుంది. దీని పొడవు సుమారు 2.1 కిలోమీటర్లు ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. ఎయిర్ పోర్ట్ లో ఉన్న మూడో రన్ వే నుంచి మొదటి టర్మినల్ ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ రన్ వే మీదుగా ప్రయాణించడం వల్ల దాదాపు 7 కిలో మీటర్ల ప్రయాణ దూరాన్ని తగ్గించవచ్చు. దీంతో పాటూ ఫ్లైట్ లోకి త్వరగా చేరుకోవచ్చు. నిత్యం ఢిల్లీ విమానాశ్రయానికి వేల సంఖ్యలో ప్రయాణీకులు వస్తూ పోతూ ఉంటారు. అందులో డొమెస్టిక్ పాసింజర్లతో పాటూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఉంటారు. నిత్యం ఇక్కడ నుంచి 1500 లకు పైగా ఫ్లైట్లు గమనాగమానాలు చేస్తూ ఉంటాయి. వీరందరి రద్దీని సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త మార్గాన్వేషణను రూపొందించారు. రానున్న రోజుల్లో మరింత సుందరంగా అత్యాధునికంగా తీర్చిదిద్దుతామంటున్నారు ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు. ఇన్నాళ్లూ రోడ్లకు, రైళ్లకే ఫ్లై ఓవర్లు నిర్మిస్తారని అనుకున్నాం. ఈ నవీన నిర్మాణంతో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేందుకు కూడా ఫ్లై ఓవర్లు నిర్మిస్తారని చూస్తున్నాం.
T.V.SRIKAR