NEGGEDEVARU-ELUR : ఏలూరులో క్రాస్ ఓటింగ్ కన్ ఫ్యూజన్.. వైసీపీని దెబ్బేస్తుందా ?

రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశరాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం...ఏలూరు పార్లమెంట్‌. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంట్ పేరు తరుచూ నానుతూనే ఉంటుంది.

 

 

రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశరాజకీయాల దృష్టిని ఆకర్షించే స్థానం…ఏలూరు పార్లమెంట్‌. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఈ పార్లమెంట్ పేరు తరుచూ నానుతూనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఉత్కంఠగానే సాగుతాయి. తాజా ఎన్నికల్లో లోకల్‌ వర్సెస్‌ నాన్‌ లోకల్‌ అన్నట్లు ఫైట్‌ నడిచింది. ఇద్దరి వారసుల మధ్య జరిగిన పోరులో…ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. రెండు ప్రధాన పార్టీల తరపున యువకులే తలపడ్డారు. ఈ పార్లమెంటులో విజయం సాధించబోయే పార్టీ…రాష్ట్రంలో అధికారంలో వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్, టిడిపి తరపున పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టిన వైసీపీ…ఈసారి సీన్ రిపీట్ చేస్తుందా ? లేదంటే టీడీపీ విజయం సాధిస్తుందా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 16 లక్షల 25 వేల 655 మంది. ఇందులో పురుషులు 7 లక్షల 93 వేలు, మహిళలు 8 లక్షల 31 వేల మంది ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే…2014లో 82.76%, 2019లో 83.75% శాతం పోలింగ్ నమోదైంది. తాజాగా ఎన్నికల్లో 84 శాతానికి చేరింది.

2019 ఫలితాలను రిపీట్ చేసేందుకు వైసిపి… ముందునుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ దూరంగా ఉండటంతో…బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్‌ను అభ్యర్థిని బరిలోకి దించింది. ఏలూరు పార్లమెంట్‌లో యాదవ సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉండటంతో…సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన సునీల్…నియోజకవర్గంలో అన్ని వర్గాల్ని కలుపుకొని వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చిన తెలుగుదేశం…తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బీసీ వర్గానికి చెందిన పుట్టా మహేష్ కుమార్‌ను బరిలోకి దించింది. పుట్టా మహేష్ యాదవ్…టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్టుడికి అల్లుడు. ఏలూరు పార్లమెంట్‌ పరిధిలో లక్షన్నరకు పైగా యాదవ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు బీసీలకు ఎంపీ సీటు కేటాయించిన సందర్భాలు లేవు.

ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసిపి ఎమ్మెల్యేలు ఉండటం కారుమూరి సునీల్‌కు కలిసి వచ్చాయి. తండ్రి నాగేశ్వరరావు… పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్మన్‌గా పని చేసినప్పటి నుంచి సునీల్‌కు ఏలూరుతో అనుబంధం ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి ఏడు అసెంబ్లీ స్థానాల్లో అద్భుతమైన విజయాలను ప్రజలు అందించారు. ఊహించని మెజార్టీలను ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్ సహకారం, ఇటు పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేల సహకారం ఉండడంతో ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో సునీల్ ఉన్నారు. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశాలు లేకపోలేదు. మాజీ మంత్రి ఆళ్ల నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు పనితీరుపై స్థానికల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కారుమూరి సునీల్‌కు జనంలో ఆదరణ ఉన్నా…స్థానిక నాయకులపై వ్యతిరేకత… ఎలాంటి ప్రభావం చూపుతుందో జూన్ 4న తేలనుంది.

కడప జిల్లాకు చెందిన పుట్ట మహేశ్‌కు ఏలూరు నుంచి బరిలోకి దించింది. ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన టీడీపీ ఈసారి విజయంపై ధీమాగా ఉంది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టిన మహేశ్‌కు నేతలందరినీ సమన్వయం చేసుకునే టైమ్ సరిపోలేదు. పార్లమెంట్‌ పరిధిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ…నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటులో కూడా గెలవకపోవడం కొంత మైనస్. యనమల కుటుంబానికి చెందిన వ్యక్తికి సీటు కేటాయించడంపై కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి…ఎంపీ సీటు ఆశించారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడంతో…పుట్టా మహేశ్‌ను రంగంలోకి దింపింది. అటు జనసేన, ఇటు బిజెపి పార్టీలు టిడిపికి ఎంతవరకు సహకరించాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలవరం, ఉంగుటూరు స్థానాల్లో జనసేన, కైకలూరు అసెంబ్లీలో బిజెపి పోటీ చేస్తున్నాయి. దీంతో ఎంపీ అభ్యర్థి గుర్తు సైకిల్‌తో పాటు రెండు చోట్ల గ్లాస్, మరో చోట కమలానికి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు లేకపోలేదని విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు పోలవరం, కొల్లేరు, చింతలపూడి లిఫ్ట్ నిర్వాసితుల సమస్యలు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటోంది కూటమి. ఏలూరు పార్లమెంటును ఈసారి ఎవరు కైవసం చేసుకోబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. 2019ని రిపీట్ చేయాలని వైసిపి ఉంటే.. పొత్తులతో విజయం దక్కుతుందని మహేశ్‌ ధీమాతో ఉన్నారు. ఏలూరులో నెగ్గేదెవరు అన్నది జూన్ 4న చూద్దాం.