ఎమర్జింగ్ ఆసియాకప్ భారత్,పాక్ పోరుకు రెడీ

ఒకవైపు భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ అలరిస్తుంటే... మరోవైపు చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో క్రికెట్ సమరం కూడా ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతోంది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా భారత్ ఎ, పాకిస్థాన్ ఎ జట్లు శనివారం తలపడనున్నాయి.

  • Written By:
  • Publish Date - October 19, 2024 / 01:33 PM IST

ఒకవైపు భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ అలరిస్తుంటే… మరోవైపు చిరకాల ప్రత్యర్థుల మధ్య మరో క్రికెట్ సమరం కూడా ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతోంది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా భారత్ ఎ, పాకిస్థాన్ ఎ జట్లు శనివారం తలపడనున్నాయి. ఒమన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇరు రు జ‌ట్ల‌కు ఇదే మొద‌టి మ్యాచ్‌. దీంతో విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.ఈ టోర్నీలో భార‌త జ‌ట్టుకు యువ ఆట‌గాడు, హైద‌రాబాదీ తిల‌క్ వ‌ర్మ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఇండియా జ‌ట్టులో తిల‌క్‌తో పాటు యువ సంచ‌ల‌నం అభిషేక్ శర్మకు చోటు ద‌క్కింది. ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ క్రికెటర్లకు కూడా సెలక్టర్లు పిలుపునిచ్చారు. యువ ఆట‌గాళ్లు ఆయుష్ బదోని , రమన్‌దీప్ సింగ్ , ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా , అనుజ్ రావత్ కూడా భార‌త ఏ జట్టు తరపున ఆడుతున్నారు.

2022 అండర్-19 ప్రపంచకప్ విజేత, ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు కూడా చోటు దక్కింది. ఆసియా స్థాయిలో అన్ని దేశాల ఏ జట్లు ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఆడతాయి. మొత్తం 8 దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక , గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు ఆయా గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక్కోసారి తలపడనుంది. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది. కాగా ఈ టోర్నీ చరిత్రలో పాకిస్థాన్, శ్రీలంక ఏ జట్లు రెండేసి సార్లు టైటిల్ గెలవగా… భారత్ 2013లో ఛాంపియన్ గా నిలిచింది.

మరోవైపు పాకిస్తాన్ జ‌ట్టుకు యువ ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ హ్యారీస్ నాయ‌క‌త్వం వ‌హించనున్నాడు. గ‌తేడాది అత‌డి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమ‌ర్జింగ్ ఆసియాక‌ప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు హ్యారీస్ ఉవ్విళ్లరూతున్నాడు. ఇదిలా ఉంటే గత ఏడాది శ్రీలంక వేదికగా జరిగిన ఎమర్జింగ్ ఆసియాకప్ భారత్ ఏ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఫైనల్లో పాక్ ఏ జట్టు చేతిలోనే ఓడిపోయింది. లీగ్ స్టేజ్ లో పాక్ ను చిత్తుగా ఓడించినప్పటకీ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచింది. భారత బౌలర్లు విఫలమవడంతో పాక్ 352 పరుగుల భారీస్కోర్ చేయగా…భారత్ ఏ జట్టు 224 పరుగులకే కుప్పకూలింది. ఆ ఓటమికి ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.