గెలుపు దిశగా ఇంగ్లాండ్ ఫ్లాట్ వికెట్ పై పాక్ ఫ్లాప్

నాలుగురోజుల పాటు తొలి ఇన్నింగ్స్ లే ఆడారు... ఏకంగా 1379 పరుగులు నమోదయ్యాయి...ఈ గణాంకాలు చూస్తే చాలు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కే అనుకూలంగా ఉందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఒకేరోజు ఆటమిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అనుకుంటారు.

  • Written By:
  • Publish Date - October 11, 2024 / 12:33 PM IST

నాలుగురోజుల పాటు తొలి ఇన్నింగ్స్ లే ఆడారు… ఏకంగా 1379 పరుగులు నమోదయ్యాయి…ఈ గణాంకాలు చూస్తే చాలు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కే అనుకూలంగా ఉందని ఎవరైనా చెప్పేస్తారు. ఇక ఒకేరోజు ఆటమిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనే అనుకుంటారు. కానీ ఇలాంటి పిచ్ పై కూడా తాము ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంటామని పాకిస్థాన్ జట్టు నిరూపిస్తోంది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని, అనిశ్చితికి మారుపేరుగా ఉన్న పాక్ జట్టు ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో ఓటమి అంచున నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగుల భారీస్కోర్ చేసిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేసింది. ముల్తాన్ పిచ్ పై ఇప్పటి వరకూ నాలుగు రోజుల ఆట జరిగితే రెండు జట్లు తొలి ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాయి. ఫ్లాట్ వికెట్ పై ఇంగ్లాండ్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది.

హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీతో ఏకంగా 823 పరుగులు చేసింది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్‌. ఈ జాబితాలో అత్యధిక​ టీమ్‌ స్కోర్‌ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌ పై శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేసింది. అయితే టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక​ స్కోర్లు కూడా ఇంగ్లండ్‌ పేరిటే ఉన్నాయి. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్ లో భారీస్కోర్ చేసిన పాక్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు పాక్‌ ఇంకా 115 పరుగులు వెనుకపడి ఉంది. పాక్‌ చేతిలో మరో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ ఓటమి దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ గట్టెక్కాలంటే చివరి రోజంతా బ్యాటింగ్‌ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసంభవమనే చెప్పాలి.