ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి రెండు సార్లు మంత్రిగా రాణించిన నేత. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు. కేసీఆర్ తో చిన్నపాటి విభేదాల కారణంగా పార్టీ వీడి బీజేపీలో చేరి ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆయన సతీమణి జమున రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇంతకాలం పరోక్షంగా ఈటెలతో కలిసి పనిచేసిన ఈమె ప్రత్యేక్షంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అది కూడా కేసీఆర్ పై పోటీ చేసి గెలవాలన్న కోరికతో ఉన్నారు. అందుకే గజ్వేల్ బీజేపీ టికెట్ కోసం జమున దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అభ్యర్థిగా దరఖాస్తు..
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దర్ఖస్తులు ఆహ్వానించింది. అయితే ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇందులో సుమారు 6వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు బీజేపీ నాయకులు. చివరి రోజు అత్యధికంగా 2,700 పైచిలుకు అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అందులో మాజీ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ భార్య ఈటెల జమున ఉండటం గమనార్హం. కొత్త వారు ధరఖాస్తు చేసుకుంటుంటే పార్టీలో యాక్టీవ్ గా పనిచేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్ ఉన్నారు.
కేసీఆర్ మీద పోటీకి ఈటెల జమున సై..
బీఆర్ఎస్ లో పనిచేసిన తన భర్తన అవమానించి బయటకు పంపించారని ఆగ్రహంతో రగిలిపోతున్నరు జమున. గతంలో అనేక ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే ఈసారి ఎలాగైనా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులోనూ రావడం రావడమే తెలంగాణ బాద్ షా కేసీఆర్ పైనే పోటీకి నిలబడేందుకు సిద్దమైపోయారు. అయితే పార్టీ ఈ టికెట్ కన్ఫాం చేస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ పోటీ చేసి గెలుస్తారా.. లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్న వేళ ఎంత సర్కిల్ ఉంటే అక్కడి నుంచి పోటీ చేస్తానన్న ధీమా వ్యక్తం చేసారని కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఓకేనా..
ఒకే పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి ముందుండి పనిచేసేవాళ్ళను పక్కన పెట్టి ఇలా ఒకే కుటుంబానికి సహకరించడం పై లోలోపల నాయకులలో విమర్శలతో పాటూ అసహనం మొదలవుతుంది. ఇచ్చినా ఇవ్వొచ్చు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే బీజేపీలో బలమైన నాయకులు కరువయ్యారు. పైగా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కూడా మందకొడిగా సాగింది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు అవసరం అని భావిస్తే టికెట్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది.
మహిళా కార్డు కీలకం..
కేసీఆర్ తన 115 ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలో మహిళలకు ఎక్కడా పెద్ద పీట వేయలేదు. దీనిని అస్త్రంగా మార్చుకొని మహిళలకు బీజేపీ పెద్ద పీట వేస్తుందని చెప్పేందుకు ఈమెను పావుగా వాడుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాకుండా ఈనెల 17 నుంచి జరగబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడ ప్రవేశపెట్టే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా కేసీఆర్ పైనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక మహిళను నిలబెట్టామని గొప్పగా చెప్పుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.
ఏది ఏమైనా ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా వచ్చే వరకూ వేచి చూడాలి. ఈమె పేరు జాబితాలో ఉంటుందా.. ఉంటే ఎన్నికల్లో గెలుస్తుందా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచిచూడక తప్పదు.
T.V.SRIKAR