సాధారణంగా మనం ఏ ఊరికి వెళ్లాలన్నా చేతిలో లగేజ్ బ్యాగ్ మన వెంట తీసుకెళ్తాం. ప్రస్తుత కాలంలో బరువును మోసుకొని వెళ్లే అవసరం లేకుండా లగేజ్ బ్యాగ్ కి కింద వీల్స్ అమర్చారు. తద్వారా వాటిని మనతోపాటూ లాక్కొని వెళ్తాం. ఇది సహజంగా ఎక్కడ పర్యాటక ప్రాంతాలకు వెళ్లినా మనం చేసే సహజమైన క్రియ. అయితే యూరప్ ప్రభుత్వం మాత్రం సూట్ కేస్, ట్రాలీల విషయంలో కఠినమైన ఆంక్షలు విధించింది. ఎవరైనా లగేజిని రోడ్లపై తీసుకెళ్తూ కనిపిస్తే 380 డాలర్ల జరిమానా కూడా విధిస్తుంది. దీనికి గల కారణం ఏంటా అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. మరికొందరైతే బాంబులు, మారణాయుధాలు, స్మగ్లింగ్ వంటి అసాంఘీక కార్యకలాపాలు చేస్తారేమో అన్న ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు అనుకుంటారు. ఇలా ఆలోచిస్తే మీరు పొరబడినట్లే అవుతుంది.
యూరప్ అనేది అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ క్రోయేషియాలో డుబ్రోవ్నిక్ అనే పర్యాటక నగరం ఉంది. అందులో మధ్యయుగం నాటి రాళ్లతో కూడిన ఎత్తైన నిర్మాణాలు, ప్రకృతిని పులకరింపజేసే అందమైన సూర్యోదయం చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిని చూసేందుకు లక్షలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అలా వచ్చే క్రమంలో లగేజ్ బ్యాగులు, సూట్ కేసులు తమ వెంట శబ్ధం చేస్తూ ఈడ్చుకొని వస్తారు. ఇలా చేయడంవల్ల తీవ్రమైన శబ్ధ కాలుష్యం ఏర్పడి మనసు ప్రశాంతతను కొల్పోతుందని అక్కడి స్థానికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు శబ్ధ కాలుష్య నియంత్రణా చర్యల్లో భాగంగా ఈ రకమైన రూల్స్ తీసుకొని వచ్చారు.
ఒకవేళ ఈ రూల్స్ తెలియకుండా ఎవరైనా లగేజ్ బ్యాగులు తీసుకెళ్తే పరిస్థితి ఏంటి అనే సందేహం మీలో కలుగవచ్చు. అలాంటి వారికోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మీ లగేజీని భద్రపరిచేందుకు ప్రత్యేకమైన లాకర్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అక్కడి మేయర్ మాటో ఫ్రాంకోవిక్ పేర్కొన్నారు. వీటికోసం కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే మరిన్ని నిబంధనలను తీసుకొచ్చారు. పెంపుడు జంతువులను తమతోపాటూ తీసుకొని రావడం, ఎక్కడ పడితే అక్కడ వాటిని వదిలేయడం, షర్ట్ లేకుండా రోడ్లపై తిరగడం, అక్కడి స్మారక చిహ్నాలపై ఎక్కి ఫోటోలు తీసుకోవడం నిషేధం అని తెలిపారు. గడిచిన రెండు, మూడేళ్లుగా ఇక్కడి పర్యాటకం చాలా బాగా అభివృద్ది చెందినట్లు చెప్పారు. ఈ పర్యాటక ప్రదేశాలన్నింటిలో డుబ్రోవ్నిక్ ఎక్కువ మంది సందర్శించినదిగా ప్రదమ స్థానంలో ఉందన్నారు. గతేడాదికంటే ఈ సంవత్సరం 32 శాతం అధికంగా పర్యాటకుల సంఖ్య పెరిగిందన్నారు. దాదాపు మూడు లక్షల మంది ఇక్కడ పర్యటించినట్లు వివరించారు.
T.V.SRIKAR