KCR : క్యాంపాఫీస్ కి ఎప్పుడొస్తారు సార్.. గజ్వేల్ ప్రజల ఎదురు చూపులు

గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినా తమకు కేసీఆర్ దర్శనభాగ్యం కలగడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గెలిచి 8 నెలలైంది.

గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచినా తమకు కేసీఆర్ దర్శనభాగ్యం కలగడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. గెలిచి 8 నెలలైంది… సార్ ఎక్కడున్నారు అంటూ అడుగుతున్నారు. గజ్వేల్ లో ఎమ్మెల్యే క్యాంపాఫీస్ ఉన్నా అక్కడికి రావట్లేదు… నియోజకవర్గ ప్రజలు ఏదైనా పని ఉండి… ఫామ్ హౌస్ కి వెళితే అక్కడ కేసీఆర్ ను కలవనీయడం లేదని వాపోతున్నారు.

కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గజ్వేల్ ప్రజలది ఇదే పరిస్థితి. సీఎంగా బిజీ బిజీగా ఉండటంతో ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్ వదిలి రాలేదు. అది తప్పితే ఫామ్ హౌస్ లో ఉండేవారు. ఇప్పుడు మాజీ అయ్యారు కదా… ఇప్పటికైనా తమని కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు. ఇంకా దారుణం ఏంటంటే… గజ్వేల్ నియోజకవర్గంలో ఆరేళ్ళ క్రితం అంటే… 2019లో ఎమ్మెల్యే క్యాంపాఫీస్ నిర్మించారు. అది ఓపెన్ అయ్యాక… ఇప్పటి వరకూ కేసీఆర్ అడుగు పెట్టలేదు. ఇక నుంచి ప్రతి నెలా క్యాంపాఫీసులో ప్రజలకు దగ్గరగా ఉంటానని… మొన్నటి ఎన్నికల ప్రచారంలో చెప్పిన కేసీఆర్ ఆ మాట మర్చిపోయారు.

ఈమధ్యే బీజేపీ నేతలు నిరసన కూడా తెలిపారు. కేసీఆర్ ను మూడు సార్లు గెలిపించినా… ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు… కేసీఆర్ ఎక్కడున్నాడో తెలీదు… అంటూ పోస్టర్లు అంటించి నిరసన తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి… వ్యవసాయంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి… గజ్వేల్ నియోజకవర్గానికి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాలేదు… ఆయన ఆచూకీ చెప్పండి. అంటూ బీజేపీ నేతలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈమధ్యే గజ్వేల్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులు కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ కి వచ్చారు. కేసీఆర్ కలవకపోవడంతో… ఫామ్ హౌజ్ ముందు ధర్నా చేశారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని గజ్వేల్ ప్రజలు కోరుతున్నారు.