తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందనీ… కాంగ్రెస్ డోర్లు తెరిచినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి చాలా రోజులైంది. పాతిక మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారని అప్పట్లో చెప్పారు. కానీ … ముగ్గురంటే ముగ్గురే హస్తం పార్టీలో చేరారు. ఎందుకు కాంగ్రెస్ లో చేరడానికి గులాబీ ఎమ్మెల్యేలు ఎందుకు ముందుకు రావట్లేదు.
లోక్ సభ ఎన్నికలంటే ముందే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కారు దిగిపోతారని రేవంత్ రెడ్డి ప్రొజెక్ట్ చేశారు. చాలామంది తమతో టచ్ లో ఉన్నట్టు చెప్పారు. కనీసం పాతిక మందైనా చేరతారనీ… వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్ లో చేర్చుకొని BRSLP ని విలీనం చేసుకోవాలని రేవంత్ ప్లానేశారు. ముగ్గురు, నలుగురు BRS నేతలు హస్తం పార్టీలో చేరగానే… మిగతా ఎమ్మెల్యేలంతా క్యూ కడతారని అంతా అనుకున్నారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు ఈ ముగ్గురు MLAలు మాత్రమే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దానం సికింద్రాబాద్ ఎంపీగా నిలబడటానికి… కడియం తన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టిక్కెట్ కోసం పార్టీ మారారు. ఇక పొంగులేటి తనకు రాజకీయ గురువు కావడంతో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరారు. తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభలో 15 మంది దాకా BRS ఎమ్మెల్యేలు సడన్ సర్ ప్రైజ్ గా వచ్చి జాయిన్ అవుతారని అన్నారు. కానీ అలాంటి అద్భుతం ఏమీ జరగలేదు. ఇప్పుడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా వెనక్కి తగ్గారు.
కాంగ్రెస్ లో చేరికలు ఇక ఆగిపోయినట్టే అనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల తర్వాతే ఏవైనా ఉంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయన్న దానిపై చేరికలు ఉండే ఛాన్సుంది. బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కితే… తెలంగాణలో రాజకీయం మారుతుందన్న టాక్ ఉంది. అందుకే ముందే తొందరపడి కాంగ్రెస్ లో చేరడం మంచిది కాదని భావిస్తున్నారు కొందరు BRS ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ లో చేరడానికి BRS ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించకపోయినా… ఆ పార్టీలోనూ అంతగా యాక్టివ్ గా లేరు. BRS ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించే ఆలోచన కూడా చేయట్లేదు. పైగా కొందరు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నుంచే 20మంది MLAలు BRS లోకి వస్తారని కేసీఆర్ మాట్లాడినా… ఆ గారడీ మాటల్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వచ్చిన కామెంట్స్ కి చెక్ పెట్టడానికే రేవంత్ ఈ మైండ్ గేమ్ మొదలు పెట్టినట్టు అర్థమవుతోంది. లోక్ సభ ఎన్నికల తర్వాత పరిస్థితిని బట్టి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి దూరాలని చాలామంది BRS ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టు అర్థమవుతోంది.