Somanna: దొర కాళ్లకు మెక్కిన జనం పాట..కేసీఆర్ కి తలవంచిన మరో ప్రజా గాయకుడు

పాట, ఆటతో జనాన్ని ఉర్రూతలూగించిన ఉద్యమ గాయకుడు ఏపూరి సోమన్న రాజకీయ ప్రస్థానం దారితెన్నులేకుండా కొనసాగుతోంది. ఉద్యమ పాట ఒడుదొడుకులకు లోనవుతోంది. ప్రశ్నించే పాటకు పదును కోల్పోయి మొండికత్తవుతోంది. కండువాలు జెండాలు మార్చుకుంటూ వెళుతున్న ఏపూరి చివరకు గులాబీ గూటికి చేరుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 02:53 PM IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనకుంటూ ఒక ప్రత్యేక శైలితో జనాన్ని జాగృతం చేశాడు ఏపూరి సోమన్న. తెలంగాణ ఉద్యమానికి చాలా మంది కళాకారుల మాదిరిగానే ఊపిరిపోశాడు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేపడే క్రమంలో ఏపూరి తన వంతుగా ప్రజలను చైతన్యవంతులను చేశాడు. తెలంగాణలో అరుదైన కళాకారుడుగా గుర్తింపు పొందాడు. తెలంగాణ ఉద్యమంలో రసమై బాలకిషన్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో కేసీఆర్‌కు, తద్వారా ఆ పార్టీకి దూరమైన ఏపూరి కాంగ్రెస్‌లో పార్టీలో చేరాడు, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభల్లో, కాంగ్రెస్‌ క్యాంఫెయిన్‌లో విస్తృతంగా పాల్గొన్నాడు. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా నడుచుకున్నారు. రేవంత్‌ పాదయాత్రలోనూ పాల్గొని సోమన్న తన గళం వినిపించారు. కేసీఆర్‌కు, ప్రధానంగా ఆయన కూతరు కవిత వ్యతిరేకంగా రాసి పాడిన ఏపూరి పాటలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి.

కాంగ్రెస్‌తోనే కొంత కాలం జర్నీ చేసిన ఏపూరి ఏమైందో ఏమోగానీ ఊహించని విధంగా రెండేళ్ల కిందట షర్మిల నేతృత్వంలో వైఎస్సార్‌టీపీలో చేరారు. కాంగ్రెస్‌ను వీడి.. వైఎస్సార్‌ టీపీలో చేరే సమయంలో ‘‘నియంతృత్వ భావజాలం ఉన్న ప్రభుత్వాన్నిఎదుర్కొనేందుకే వైఎస్సార్‌ టీపీలో చేరుతున్నా’’నని ప్రకటించారాయన. అప్పటి నుంచి ఆయన షర్మిల వెంట నడుస్తూ వస్తున్నారు. ఏపూరి సోమన్న నిన్నటి దాకా వైఎస్సార్‌టీపీ తరపున తన సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్‌టీపీకి ఝలక్‌ ఇస్తూ.. టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ సమక్షంలో కేటీఆర్‌ను కలిశారు. త్వరలో బిఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించాడు. కేటీఆర్‌ కూడా బీఆర్‌ఎస్‌లోకి ఏపూరిని ఆహ్వానించాడు. బీఆర్‌ఎస్‌కు సాంస్కృతిక విభాగానికి వెన్నముకగా నిలిచిన సాయిచంద్‌ మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించడానికే ఏపూరిని వ్యూహాత్మంకంగా బీఆర్‌ఎస్‌ ఆహ్వానించింది.
బీఆర్‌ఎస్‌ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్‌ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి.

సోమన్న కేసీఆర్‌కే, బీఆర్‌ఎస్‌ వ్యతిరేకంగా పాడిన పాటలు మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఏపూరి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలియగానే పాటలను బయటకు తీసి ఏపూరిని ఉతికి ఆరేస్తున్నారు. తాను పాడిన పాటలే గాయలు అవుతుంటే ఆ గాయాలను ఏలా ఏపూరి మాన్పుకుంటాడో చూడాలి.