టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీని అతని మాజీ భార్య హసీస్ జహాన్ మళ్ళీ టార్గెట్ చేసింది. షమీ చాలా కాలం తర్వాత ఇటీవల తన కుమార్తెను కలుసుకున్నాడు. కుమార్తెతో కలిసి షాపింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ షాపింగ్ అంతా షో అంటూ షమీపై మరోసారి హసీన్ జహాన్ విరుచుకుపడింది.
తన కుమార్తె కొత్త పాస్ పోర్టుకు కోసం ఆమె వెళితే షమీ సంతకం చేయలేదని చెప్పుకొచ్చింది. కూతురితో షమీ వెళ్ళిన షాపింగ్ మాల్ అతను ప్రచారం చేసే కంపెనీదేనని, బిల్లు కూడా చెల్లించనవసరం లేదని చెప్పింది. ప్రమోషన్‌లో భాగంగానే ఆ షాపింగ్ చేసి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ విమర్శించింది.
చివరికి తన కుమార్తెకు కావాల్సిన కెమెరా, గిటార్ మాత్రం అతను కొనివ్వలేదంటూ హసీన్ ఫైర్ అయింది. కూతురు గురించి షమీ ఎప్పుడూ అడగడని ఆమె చెప్పింది. నెల రోజుల క్రితమే పాపని కలిసినప్పుడు పెట్టలేదని.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసమే ఆ వీడియోను పోస్ట్ చేశాడని ఆరోపించింది. కాగా షమీ, హసీన్ 2018 నుంచి విడిగా ఉంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో షమీ ప్రతి నెలా హసీన్ జహాన్‌కు భరణం కింద లక్షా 30 వేల రూపాయలు చెల్లిస్తున్నాడు. ఇదిలా ఉంటే గాయం కారణంగా గత ఏడాది నవంబరు నుంచి క్రికెట్‌కి దూరమైన షమీ ప్రస్తుతం బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ సీనియర్ పేసర్ ఆసీస్ తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులోకి తిరిగి వచ్చే అవకాశముంది.