సినిమాలో ఆ చెట్టు ఉంటే సినిమా సూపర్ హిట్, ఆ చెట్టు కింద ఏ పాట షూట్ చేసినా సరే పాపులర్ అయినట్టే, గోదావరి జిల్లాల్లో ఏ సినిమా షూట్ జరిగినా సరే ఆ చెట్టు ఒక్క సెకన్ అయినా కనపడాల్సిందే… కాని ఇప్పుడు ఆ చెట్టు లేదు. 150 ఏళ్ళ క్రితం నాటిన ఆ చెట్టు 300 సినిమాల షూటింగ్ లకు సజీవ సాక్ష్యంలా నిలిచింది. ఎందరో ఆర్టిస్ట్ లకు నీడనిచ్చింది, ఎన్నో హిట్ సినిమాల్లో ఠీవిగా నిలబడింది. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఆ చెట్టు ప్రకృతి ముందు తలవంచింది. గోదారి తీరంలో సినిమా వాళ్లకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ చెట్టు నేలకొరిగింది.
ఆ చెట్టే… కొవ్వూరు మండలంలోని కుమార దేవంలో ఉన్న నిద్ర గన్నేరు చెట్టు. ఎప్పుడో 150 ఏళ్ళ క్రితం సింగలూరి తాతబ్బాయి ఆ చెట్టుని నాటారని స్థానికులు చెప్తున్నారు. 1975 లో వచ్చిన పాడి పంటలు సినిమాతో ఈ చెట్టు ప్రస్తానం సినిమాల్లో మొదలయింది. ఈ చెట్టు కింద రొమాంటిక్ సన్నివేశాలను కూడా షూట్ చేసేవారు. అక్కడి నుంచి ఎందరో అగ్ర దర్శకులు తమ హిట్ సినిమాల్లో ఈ చెట్టుని చూపించారు. బాపు దగ్గరి నుంచి సుకుమార్ వరకు ఎందరో దర్శకులు ఈ చెట్టు వద్ద సినిమాలను షూట్ చేసారు.
కనీసం ఒక్క చిన్న సీన్ అయినా సినిమాలో ఉంటే చాలు అనుకుని మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు, ఆపద్బాందవుడు, రంగస్థలం సినిమాల్లో ఆ చెట్టుని చూపించారు. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా ఈ చెట్టు ఉన్న సన్నివేశాలను షూట్ చేసారు. అయితే అనూహ్యంగా ఆదివారం ఈ చెట్టు పడిపోయింది. వర్షా కాలం కావడం, భారీ వృక్షం కావడంతో కూలిపోయిందని స్థానికులు చెప్తున్నారు. సినిమా వాళ్ళు గాని ప్రభుత్వాలు గాని ఈ చెట్టుని పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.