కోహ్లీ కోసం దూసుకొచ్చిన ఫ్యాన్, ఎంసీజీలో సెక్యూరిటీ ఫెయిల్యూర్

భారత్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు కూడా ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. కంగారూలను త్వరగా ఆలౌట్ చేస్తారనుకున్న భారత బౌలర్లు నిరాశపరిచారు.

  • Written By:
  • Publish Date - December 27, 2024 / 07:59 PM IST

భారత్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు కూడా ఆతిథ్య జట్టుదే పైచేయిగా నిలిచింది. కంగారూలను త్వరగా ఆలౌట్ చేస్తారనుకున్న భారత బౌలర్లు నిరాశపరిచారు. అయితే రెండోరోజు ఆటలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరవగా.. సెక్యూరిటీ ఫెయిల్యూర్ హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రేక్షకుడు మైదానంలోకి దూసుకొచ్చాడు.
ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి వచ్చేశాడు. కోహ్లీ భుజంపై చేయి వేసి మాట్లాడుతూ హంగామా చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది సదరు అభిమానిని మైదానం బయటకు తీసుకెళ్లారు. మైదానంలోకి దూసుకొచ్చిన సదరు అభిమాని ఫ్రీ ఉక్రెయిన్ అనే టీషర్ట్ ధరించాడు. మైదానంలోకి అడుగుపెట్టిన అతను నేరుగా కోహ్లీ దగ్గరకు వచ్చి అతని భుజాలపై చేతులేసాడు. మెడపట్టి తన దగ్గరకు లాగుకున్నాడు. కోహ్లీ కూడా అతనికి సహకరించాడు.

అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అభిమాని నేరుగా కోహ్లీ దగ్గరకు వెళ్లడంతో అందరూ టెన్షన్ పడ్డారు. తొలి రోజు ఆటలో కోహ్లీ.. ఆసీస్ అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాన్‌ను భుజంతో ఢీకొట్టడం వివాదాస్పదమైన నేపథ్యంలో కోహ్లీని ఆసీస్ ఫ్యాన్స్ గేలి చేశారు. ఈ క్రమంలో అభిమాని మైదానంలోకి దూసుకొస్తూ కోహ్లీ దగ్గరకు వెళ్లడంతో అతనిపై దాడి చేస్తారేమోనని భయపడ్డారు. కానీ సదరు అభిమాని కోహ్లీ భుజాలపై చేతులేసి చిందేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇదే అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి కోహ్లీ భుజాలపై చేతులు వేసాడు. అయితే భద్రతా పరంగా ఎంతో అప్రమత్తంగా ఉండే ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటన జరగడంపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 రన్స్ కు ఆలౌటైంది.