Rohith Sharma: కొంపముంచిన ముంబై ఇండియన్స్?

నిన్న టీం ఇండియా బంగ్లాదేశ్ తో ఓటమికి కారణం ముంబై ఇండియన్స్ జట్టులోని నలుగురు కీలక ప్లేయర్లే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 16, 2023 / 03:32 PM IST

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో పోరాడినా ఫలితం దక్కలేదు. గిల్ మినహా మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 ఒక్కడే రాణించాడు.

ఈ క్రమంలో ముంబై ఇండియన్సే టీమిండియాను ముంచారని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే బంగ్లాతో ఆడిన టీంలో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉన్నారు. వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కనీసం ఖాతా తెరవకుండా డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ఆటగాడు. తిలక్ వర్మ కూడా తేలిపోయాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడాల్సిన సమయంలో తంజీమ్ వేసిన బంతిని ఏమాత్రం అంచనా వేయలేకపోయాడీ తెలుగు కుర్రాడు. తిలక్ అవుటైన తర్వాత వచ్చిన రాహుల్ కాస్త క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌ను చాలా నెమ్మదిగా ఆరంభించాడు. దీంతో అతను క్రీజులో కుదురుకొని గిల్‌కు సహకారం అందిస్తాడని అంతా అనుకున్నారు.

కానీ మిరాజ్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయబోయిన కిషన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఇది చూసిన అందరూ కూడా ఆ షాట్ అక్కడ ఏమాత్రం అవసరం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇక చివరి ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. అతను క్రీజులోకి వచ్చే సరికి టీమిండియా చాలా కష్టాల్లో ఉంది. వన్డే ఫార్మాట్‌లో పరమ చెత్త రికార్డు ఉన్న సూర్యను వరల్డ్ కప్ టీంలో కూడా తీసుకున్నారు. దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలకు తన ప్రదర్శనతో సూర్య సమాధానం చెప్తాడని అంతా అనుకున్నారు. కానీ స్పిన్‌ను ఎదుర్కోవడానికి తన వద్ద ఒకే ఒక్క షాట్ ఉన్నట్లు సూర్య ప్రవర్తించాడు. తనకు బాగా అచ్చొచ్చిన స్వీప్ షాట్‌ను పదే పదే ఆడుతూ పరుగులు పిండుకోవడానికి ప్రయత్నించాడు. దీన్ని గమనించిన షకీబల్ హసన్ కూడా దానికి తగ్గట్లే బౌలింగ్ చేశాడు. దీంతో సూర్య కేవలం 26 పరుగులే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వీరిలో ఏ ఒక్కరు నిలబడి ఉన్నా టీమిండియా గెలిచేదని, ముంబై ఇండియన్సే భారత్‌ ఓటమికి కారణమని కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.