భారత్, సౌతాఫ్రికా మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్ లో భారత్ గెలిస్తే… రెండో మ్యాచ్ లో సఫారీలు గెలిచి సిరీస్ సమం చేశారు. కానీ రెండో టీ ట్వంటీలో టీమిండియాకు కూడా గెలిచే అవకాశం చివరి వరకూ వచ్చింది. అయితే సూర్యకుమార్ చెత్త కెప్టెన్సీతోనే మ్యాచ్ చేజారిపోయిందంటూ ఇటు ఫ్యాన్స్, అటు మాజీ ఆటగాళ్ళు సైతం మండిపడుతున్నారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ కు ఒక ఓవరే ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బంతి విపరీతంగా టర్న్ అవుతున్నప్పటికీ అక్షర్ పటేల్ కు ఒక ఓవర్ మాత్రమే ఇచ్చాడు. అతను వేసిన ఈ ఓవర్ లో రెండే పరుగులు ఇచ్చినా సూర్య అతనిపై నమ్మకం ఉంచలేదు. అక్షర్ పటేల్ కు మరో రెండు ఓవర్లు ఇచ్చినా భారత్ గెలిచేదని నెటిజన్స్ తో పాటు క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో సూర్య కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. వారి వైఫల్యంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. 39 పరుగులు చేసిన హార్దిక్ పాండ్య టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఛేజింగ్ లో సౌతాఫ్రికా కాస్త దూకుడుగానే ఆడినా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టి ఆశలు రేపాడు. 15వ ఓవర్ వరకూ కూడా భారత్ విజయం ఖాయంగా కనిపించింది. కానీ సూర్యకుమార్ కెప్టెన్సీ ఓటమికి కారణమైందని మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. అక్షర్ పటేల్‌కు కనీసం మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. 15వ ఓవర్ హార్దిక్ పాండ్యకు బదులుగా అక్షర్‌తో బౌలింగ్ చేయించాల్సిందని డీకే అన్నాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ బౌలింగ్‌కు వచ్చి దక్షిణాఫ్రికాను మరింత కట్టడిచేసేవాడని చెప్పుకొచ్చాడు.
15వ ఓవర్‌లో హార్దిక్ 9 రన్స్ ఇవ్వగా… తర్వాతి ఓవర్‌లో రవి బిష్ణోయ్ ఒక్క వికెట్ తీసి 4 పరుగులే ఇచ్చాడు. కానీ అర్షదీప్ సింగ్ 17వ ఓవర్లో 12 ,19వ ఓవర్ లో 16 పరుగులు ఇవ్వడం కొంపముంచింది. ఇక 18వ ఓవర్ వేసిన అవేశ్ ఖాన్ 12 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు డెత్ ఓవర్లలో పేలవ బౌలింగ్ ఓటమికి కారణంగా చెప్పలేమని మాజీ పేసర్ జహీర్ ఖాన్ వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమన్నాడు. మరో 15-20 పరుగులు చేసి ఉంటే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవన్నాడు.ఓవరాల్ గా మాత్రం సూర్యకుమార్ కెప్టెన్సీ ఈ మ్యాచ్ లో పేలవంగా ఉందన్నది చాలా మంది విశ్లేషకుల మాట. అందుబాటులో ఉన్న బౌలర్లను అతను సరిగ్గా వినియోగించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.