Gomathy Reddy: మిస్ ఇండియా పోటీలకు మన రైతు బిడ్డ

అందం, అభినయం ఉంటే చాలు మోడలింగ్ లో రాణిచేందుకు బ్యాగ్రౌండ్ అవసరం లేదని నిరూపించింది ఓ రైతు బిడ్డ. ఆంధ్రప్రేదేశ్ లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెంకు చెందిన ముక్కా గోమతిరెడ్డి.. ఈ ఏడాది మార్చి 5న ముంబైలో జరిగే మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది.

  • Written By:
  • Publish Date - February 21, 2023 / 03:50 PM IST

అందం, అభినయం ఉంటే చాలు మోడలింగ్ లో రాణిచేందుకు బ్యాగ్రౌండ్ అవసరం లేదని నిరూపించింది ఓ రైతు బిడ్డ. ఆంధ్రప్రేదేశ్ లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెంకు చెందిన ముక్కా గోమతిరెడ్డి.. ఈ ఏడాది మార్చి 5న ముంబైలో జరిగే మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. ఒకప్పుడు సినిమాలు మోడలింగ్ అంటే ఎక్కువగా నార్త్ అమ్మాయిలు గుర్తొచ్చేవారు. అందాల పోటీల్లో కూడా ఎక్కువగా నార్త్ ముద్దుగుమ్మలే కనిపించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చదువు, ఆటల్లోనే కాదు.. మోడలింగ్ రంగంలో కూడా తెలుగు అమ్మాయి సత్తా చాటుతున్నారు. తామేంటో నిరూపిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. కొన్నాళ్లుగా అందాల పోటీల్లో కిరీటాలు సంపాదిస్తూ తెలుగు ఖ్యాతిని చాటి చెప్పుతున్నారు. మిస్ ఇండియా పోటీలకు అర్హత సాధించి గోమతి కూడా ఆ లిస్ట్ లో చేరిపోయారు.
**********
ఏపీలోని అన్నమయ్య జిల్లా ముక్కావారిపల్లె గ్రామానికి చెందిన ముక్కా గోమతి రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అందరిలాగానే ఆమె కూడా మిడిల్ క్లాస్ అమ్మాయి. గోమతి తల్లి అరుణకుమారి, తండ్రి శ్రీనివాసులు రెడ్డి. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసి అందరిలా నార్మల్ గా జీవితంలో స్థిరపడాలి అని గోమతి అనుకోలేదు. తనకు ఎంతో ఇష్టమైన మోడలింగ్ లో రాణించాలని నిర్ణయించుకుంది. మోడలింగ్ ను తన కేరీర్ గా ఎంచుకుంది. చిన్న తనంలోనే బెస్ట్ బెబీ లాంటి ప్రోగ్రాంలో తన చలాకీ తనాన్ని నిరూపించుకుంది. గోమతికి ఉన్న ఇంట్రస్ట్ చూసి ఆమె తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. మోడలింగ్ వైపు అడుగులు వేసేందుకు మద్దతుగా నిలిచారు. చదువుతో పాటు మోడలింగ్ లో కూడా తాను అవకాశాలు వెతుక్కునేందుకు సహకరించారు. దీంతో తన ప్యాషన్ పై మరింత ఫోకస్ చేసింది గోమతి.
**********
డిగ్రీ చదువుతున్న సమయంలోనే చాలా అందాల పోటీల్లో గోమతి పార్టిసిపేట్ చేసింది. తన కాలేజీలో నిర్వహించిన అందాల పోటీల్లో విజయం సాధించింది. తరువాత బెంగళూరులో నిర్వహించిన సౌత్ ఇండియన్ మిస్ ఫెమినా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి వచ్చిన ప్రతీ అవకాశాన్ని తన కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు ఉపయోగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో.. ఈ సంవత్సరం జనవరి 25న ముంబైలో నిర్వహించిన మిస్ ఆంధ్ర పోటీల్లో పాల్గొని టైటిల్ గెలుచుకుంది గోమతి. ఈ విజయంతో మిస్ ఇండియా పోటీల్లో ఏపీ తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించింది. మార్చ్ 5న ముంబైలో జరిగే మిస్ ఇండియా పోటీల్లో గోమతి పార్టిసిపేట్ చేయనుంది. అంతే దీంతో గోమతి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయిపోయింది.
**********
ఇటు మోడలింగ్ తో పాటు చదువును కూడా చాలా చక్కగా గోమతి హ్యాండిల్ చేసిందని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. మోడలింగ్ రంగంలో కూతురు రాణిస్తున్న తీరు తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందంటున్నారు. అందాల పోటీ పట్ల ఎంత ఇష్టం ఉన్నా.. చదువును ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ సాఫ్టవేర్ కంపెనీలో డెవలపర్ గా గోమతి పని చేస్తోందన్నారు. ఓ పక్క తన జాబ్ కంటిన్యూ చేస్తూనే మోడలింగ్ లో తనకు వచ్చిన అవకాశాలను వాడుకుంటూ మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది గోమతి. మార్చ్ లో జరిగే అందాల పోటీల్లో కిరీటం గెలుచుకుని.. దేశవ్యాప్తంగా ఏపీ పేరును మెచ్చుకునే విధంగా చేస్తానంటున్నారు గోమతి.
**********
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితాశయం గురించి చెప్పింది గోమతి రెడ్డి. తాను మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీతో తన సోదరుడి పేరు మీద ఒక ఎన్జీవో ప్రారంభిస్తానని తెలిపింది. దాని ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పింది. తన సోదరుడు రీసెంట్ గా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడట. మోడలింగ్ రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు గోమతి బ్రదర్ తనకు ఎంతో సపోర్టివ్ గా ఉండేవాడట. తన సోదరుడితో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయింది గోమతి. తన అన్న పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలిపింది. తానే కాకుండా ప్రతీ మోడల్ కూడా తమకున్న క్రేజ్ ను సమాజ హితం కోసం ఉపయోగించాలని అడ్వైజ్ ఇచ్చింది. తాను స్టార్ట్ చేయబోయే ఎన్జీవోకు ప్రజల సహకారం కూడా కావాలని కోరింది గోమతి రెడ్డి. అయితే మిస్ ఇండియా పోటీల్లో గోమతిని కిరీటం వరిస్తుందా లేదా అనేది చూడాలి మరి.