సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు మళ్లీ ఆందోళనబాట పట్టారు. మూడేళ్ల కింద ఢిల్లీని దిగ్భందం చేసిన స్థాయిలోనే ఉద్యమానికి సిద్ధమయ్యారు. పోలీసులు అలర్ట్ అవడంతో.. ఢిల్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయింది.
రైతులు మళ్లీ ఛలో ఢిల్లీ (Chalo Delhi )అంటున్నారు. పంటలకు కనీస మద్దతు ధర సహా ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా పలు సంఘాలు (Farmers agitation) ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఈనెల 13న నిర్వహించే కార్యక్రమంలో 25వేల మంది రైతులు.. 200 రైతు సంఘాలు పాల్గొంటుండగా.. 5వేల ట్రాక్టర్లను సిద్ధం చేస్తున్నారు. మూడేళ్ల కిందట తమ ఉద్యమంతో దేశ రాజధాని ఢిల్లీని దిగ్భందం చేసిన రైతులు మరోసారి అదే స్థాయిలో ఉద్యమం చేపట్టాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసిస్తూ ఢిల్లీ ముట్టడికి బయల్దేరారు. ఎన్నికల సమయం కావడంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు రైతులు ఉద్యమ బాట పట్టారు.
దీంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. పంజాబ్, హర్యానా వైపు నుంచి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. సరిహద్దులను సీల్ చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేసి.. ఏకంగా సిమెంట్‌తో కాంక్రీట్, రోడ్లపై ఇనుప మేకులు దింపుతున్నారు. ప్రధాన మార్గాల్లో క్రేన్‌లు, కంటెయినర్‌లను సిద్ధం చేశారు. రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబాల, సోనిపట్, పంచకుల్‌లో సెక్షన్ 144 విధించారు. తేడా వస్తే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలీసులు ఆంక్షలు విధించినా.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా రైతులు తమ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. పోలీసులు బారీకేడ్లు, మేకులు ఏర్పాటు చేసినా.. వాటిని తీసేసేలా.. టియర్ గ్యాస్ ప్రయోగించినా.. తట్టుకునేలా తమ ట్రాక్టర్లను తయారు చేయిస్తున్నారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే రైతులు, ట్రాక్టర్లలో బయల్దేరారు. ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వస్తున్నారు. దీంతో, హర్యానాలోని ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. ఏడు జిల్లాల పరిధిలో బల్క్ ఎస్సెమ్మెస్‌లపై (Bulk SMS) ఆంక్షలు విధించారు.