MS Swaminathan: హరితవిప్లవ పితామహుడు ఎం ఎస్ స్వామినాథన్ కన్నుమూత

ఎంఎస్ స్వామినాథన్ హరిత శాస్త్ర పితామహుడిగా బహు ప్రసిద్ది చెందారు. ఈయన పాఠాలు దేశ ప్రగతికి అభ్యుదయ బాటలు వేశాయి.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 02:48 PM IST

వ్యవసాయం అంటే ఏంటో మన దేశ ప్రజలకు చూపించిన గొప్ప శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్. ఈయనకు హరిత విప్లవ పితామహుడు అని బిరుదు ఉంది. ఈరోజు ఉదయం 11.20 గంటలకు చెన్నైలోని తన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వామినాథన్ కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన వయసు 98 సంవత్సరాలు. వృద్దాప్య సమస్యలతో మరణించారు.

తండ్రి ప్రేరణతో ఎదిగారు..

ఎం ఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న కుంభకోణంలో ఎం.కే సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి సర్జన్ గా విధులు నిర్వర్తించే వారు. తల్లి గృహిణి. స్వామినాథన్ బాల్యం, విద్యాభ్యాసం మొత్తం కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు పూర్తిచేసారు. తన తండ్రి ప్రేరణతో వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయాలపై అవగాహన పెంచుకున్నారు. ‘మన మనసులో అసాధ్యం అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి దృఢ సంకల్పంతో కృషిచేస్తే గొప్ప పనులు సాధించ వచ్చు’ అన్న తన తండ్రి మాటలు నూతన ఉత్తేజాన్ని ఇచ్చేవి. తండ్రి మహాత్మాగాంధీ అనుచరుడు కాడంతో గాంధీ ప్రభావం స్వామినాథన్ పై పడింది. అందుకే వ్యవసాయంపై పట్టు సాధించి దేశానికి ఎనలేని సేవలను అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు.

బెంగాల్ కరువుతో వ్యవసాయరంగ అన్వేషణ..

స్వామినాథన్ 11ఏళ్ల వయసులో పైలేరియా వ్యాధి సోకి తండ్రి మరణించారు. తన మామయ్య వద్దే ఉంటూ మెట్రిక్యూలేషన్ పూర్తి చేసి మెడిసిన్ చేసేందుకు కళాశాలలో చేరారు. దీనికి గత ప్రదాన కారణం కుటుంబ నేపథ్యం మొత్తం వైద్య విద్యను అభ్యసిచడమే. అయితే ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. అదే సమయంలో 1943 నాటి బెంగాల్ కరువును చాలా ప్రత్యక్షంగా చూశారు. దీంతో ఆయన మనసు చలించిపోయింది. ఆ సమయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. భారతదేశం ఆకలిని తీర్చేందుకు నా జీవితాన్ని ధారపోస్తానని నిర్ణయించుకున్నారు. దీంతో వైద్య విద్యను వదిలి వ్యవసాయ విద్యను అభ్యసించేందుకు నడుంబిగించారు.

జంతుశాస్త్రంపై ఆసక్తి..

తన తండ్రి మాటలు, గాంధీజీ భావాలను బాగా వంటపట్టించుకున్న స్వామినాథన్ తన కెరియర్ మొత్తాన్ని పూర్తిగా మార్చుకున్నారు. వీరి ప్రభావం ఆయన మీద లేకుంటే పోలీసు అవ్వాలనుకునేవారు. ఇందులో భాగంగానే కేరళలోని త్రివేండ్రలో మహారాజ కళాశాలలో చేరి జంతుశాస్త్రంపై బీఎస్సీ పట్టా పొందారు. అప్పటి నుంచే మొక్కల పెంపకం పై అవగాహనను సాధించారు. గ్రాడ్యూయేషన్ పట్టా పొందిన తరువాత ఢిల్లీ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ లో చేరి పూర్తి స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తగా మారారు. ఆ తరువాత నెదర్లాండ్స్ లోని వాగెనేంజెన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి జెనిటిక్ విభాగంలో బంగాళాదుంపలపై పరిశోధనలు చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్లాంట్ బ్రీడింగ్ ఇన్సిట్యూట్ లో చేరి పీహెచ్ డీ చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో ఫెలోషిప్ పొందారు.

వ్యక్తిగత జీవితం..

ఎం.ఎస్ స్వామినాథన్ 1951 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదుకునే రోజుల్లో మీనా అనే మహిళ పరిచయం అయ్యారు. ఈమెతో సన్నిహితంగా మెలిగారు. ఈ సాన్నిహిత్యం పరిణయానికి దారి తీయడంతో 1955లో మీనా స్వామినాథన్ ను వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత చెన్నైలో నివాసం ఉండేవారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు జన్మించారు. వీరికి కూడా వివాహం చేశారు స్వామినాథన్. ప్రస్తుతం ఈయనకు ఐదుగురు మనుమలు ఉన్నారు.ఈ మనవళ్ల కుమారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కీలక సంస్థల్లో అత్యున్నతమైన స్థానాల్లో విధులను నిర్వర్తిస్తున్నారు. కొందరు బెంగళూరులో నివసిస్తుంటే.. మరికొందరు దేశాలు దాటి విదేశాల్లో తమ జీవన ప్రస్థాన్ని సాగిస్తున్నారు.

భారతదేశంలో ప్రయోగాలు..పదవులు..

  • 1949–55 బంగాళాదుంప, జనపనార జన్యువులపై పరిశోధన చేశారు.
  • 1955–72 మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై అధ్యయనం చేశారు.
  • 1972–79 లో మొక్కలు, జంతువులు, చేపల జన్యువనరుల కొరకు జాతీయ బ్యూరో ఏర్పటు.
  • 1979–80 భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
  • 1981–85లో మొక్కల జన్యువనరుల కమిషన్ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
  • 1986–99 – వాషింగ్టన్ డి.సి లోని వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్ సంపాదక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
  • 1988–98 – జీవవైవిధ్యానికి సంబంధించిన ముసాయిదా చట్టం ఏర్పాటు చేయడంలో ప్రదాన భూమిక పోషించారు.
  • 1994 తర్వాత జెనెటిక్ రీసోర్స్ పాలసీ కమిటికి చైర్మన్ గా ఉన్నారు.
  • 2001లో జీవావరణ నిర్వహణపై ఇండియా – బంగ్లాదేశ్ ఉమ్మడి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

స్వామినాథన్ కు వరించిన అవార్డులు..

  • 1967 లో పద్మశ్రీ అవార్డు వరించింది
  • 1971 లో రామన్ మెగసెసె అవార్డును అందుకున్నారు
  • 1972 లో పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు
  • 1986 లో ఆల్బర్డ్ ఐన్ స్టీన్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ సైన్స్ సాధించారు.
  • 1989 లో పద్మవిభూషణ్ సాధించారు
  • 1987 లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డ్ అందుకున్నారు
  • 1999 లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి వరించింది
  • 2013 లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారాన్ని స్వీకరించారు.

T.V.SRIKAR