తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అనుకున్న ఫలితాలు రాకపోయినా.. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో (Parliament Elections) సత్తా చాటాలని బీజేపీ పావులు కదుపుతోంది. సీట్లు రాకపోయినా.. భారీగా ఓటు బ్యాంక్ (vote bank) పెరగడంతో కమలనాథుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు దాదాపు కౌంట్‌డౌన్ మొదలైన వేళ.. తెలంగాణ నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి కారణాలు గుర్తించింది. నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, గ్రూప్ రాజకీయాలే కారణం అని ఫిక్స్ అయిన పార్టీ పెద్దలు.. వాటికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. నాయకులు సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం కాకపోతే… లోక్‌సభ ఎన్నికల్లోనూ నిరాశ తప్పదనే భయం బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని కసి మీద కనిపిస్తున్న బీజేపీ.. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీనికోసం చేరికల కమిటీని మళ్లీ యాక్టివ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. చేరికల కమిటీకి ఈటల రాజేందర్ (Etala Rajender) చైర్మన్‌గా ఉన్నారు. ఐతే ఈసారి కొత్తగా కమిటీని ఏర్పాటు చేయాలని… రాజేందర్‌తో పాటు బండి సంజయ్‌ను కూడా కమిటీలో నియమించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిద్వారా బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ మధ్య గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టొచ్చని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తోంది. బీజేపీలో కొన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మల్కాజ్‌గిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం పార్టీకి చెందిన సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఆ టికెట్లను దక్కించుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు.. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇతర పార్టీల్లోని కీలక నేతల్ని చేర్చుకోవడమే లక్ష్యంగా… బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేసే ప్లాన్‌లో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. బండి, ఈటల మధ్య వర్గపోరు మొదటి నుంచి కనిపిస్తోంది.
బండి కారణంగా.. ఓ టైమ్‌లో ఈటల పార్టీ మారుదామని కూడా ఫిక్స్ అయ్యారనే ప్రచారం జరిగింది. ఐతే అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి.. ఈటలను కూల్ చేశారు. అదే సమయంలో బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో.. పరిస్థితి అంతా నార్మల్ అయింది అనుకున్నారు. మళ్లీ బండికే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం మొదలైన వేళ.. ఈటల భవిష్యత్ ఏంటి అనే చర్చ జరిగింది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నింటికి క్లారిటీ ఇచ్చేలా.. ఇప్పుడు బీజేపీ కొత్త కమిటీ నియామకానికి రంగం సిద్ధం చేసి.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.