వేలంలోనూ ఫిక్సింగా ? ముంబై,ఆర్సీబీ డీల్ పై చర్చ

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు నమోదయ్యాయి. జెడ్డా వేదికగా రెండురోజుల పాటు జరిగిన ఆక్షన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యారు. భారత క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంఛైజీలు.. విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల కోసం భారీగా ఖర్చు చేశాయి.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 06:10 PM IST

ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు నమోదయ్యాయి. జెడ్డా వేదికగా రెండురోజుల పాటు జరిగిన ఆక్షన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధరలకు అమ్ముడయ్యారు. భారత క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించిన ఫ్రాంఛైజీలు.. విదేశీ ఫాస్ట్ బౌలర్లు, ఆల్‌రౌండర్ల కోసం భారీగా ఖర్చు చేశాయి. మెగా వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేసాయి. కొన్ని ఫ్రాంచైజీలు 25 మంది ఆటగాళ్లతో పూర్తిస్థాయి జట్టును కొనుక్కోగా…మరికొన్ని ఫ్రాంచైజీలు 20 లేదా 22 మందికే పరిమితమయ్యాయి. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు 639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే మెగా వేలంలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ వేలం ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ, ఆర్సీబీ సీఈవో ప్రథమేశ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన విల్ జాక్స్‌ను ముంబై ఇండియన్స్ 5.20 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్‌తో తీవ్రంగా పోటీపడి మరీ అతన్ని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన జాక్స్ ఓ సెంచరీతో 32 సగటుతో 230 పరుగులు చేశాడు. ఆఫ్‌స్పిన్‌తో రెండు వికెట్లు కూడా తీశాడు. అయితే ఆర్సీబీకి ఆర్‌టీఎమ్ ఆప్షన్ ఉండటంతో ఆక్షనీర్ మల్లికా సాగర్.. ఆర్‌టీఎమ్ కార్డ్ వాడుతారా అని ప్రశ్నించింది. కానీ జాక్స్ కోసం బెంగళూరు ఫ్రాంచైజీ ఆర్‌టీఎమ్ ఉపయోగించలేదు. దీంతో విల్ జాక్స్ ముంబైకి సొంతమయ్యాడు. మరోవైపు జాక్స్-ఆక్షన్ ముగిసిన అనంతరం ప్రథమేశ్.. ఆకాశ్ అంబానీ వైపు చూపిస్తూ డన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు.

అతనికి దగ్గరకు వెళ్ళి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇండియన్స్-ఆర్సీబీ ఫ్రాంచైజీల మధ్య ఆక్షన్ ఫిక్సింగ్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ముందే మాట్లాడుకుని వేలానికి వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌ తమకు 3 కోట్లకే సొంతమయ్యాడనే ఆనందంతో బెంగళూరు ఫ్రాంచైజీ ఆర్టీఎం వాడలేదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా ఆక్షన్ లోనూ ఫిక్సింగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.