టీమిండియాలో చోటు దక్కాలన్నా… వచ్చిన ప్లేస్ నిలబెట్టుకోవాలన్నా ఆట మాత్రమే ఉంటే సరిపోదు… ఫిట్ నెస్ కూడా ఉండాల్సిందే… ఎంత ప్రతిభ ఉన్నా కూడా ఫిట్ నెస్ లేకుంటే కెరీర్ ముగిసిపోయినట్టే… అందుకే ఇప్పుడు జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్ళందరూ ఫిట్ నెస్ పై ఫోకస్ మరింత పెంచారు. పైగా కొత్త కోచ్ గంభీర్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. అందుకే యువ క్రికెటర్లందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. తాజాగా యువ పేసర్ హర్షిత్ రాణా ఆస్ట్రేలియా టూర్ కోసం 17 కిలోల బరువు తగ్గాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా టెస్టు జట్టులోకి తొలిసారి హర్షిత్ రాణా ఎంపికయ్యాడు . స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ షమి ఇంకా పూర్తి ఫిట్ గా లేకపోవడంతో బ్యాకప్ గా అతన్ని పిక చేసింది. అక్కడ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ లాంటి వాళ్లతో హర్షిత్ పేస్ బౌలింగ్ భారాన్ని పంచుకోనున్నాడు.
ఈ ఏడాది కేకేఆర్ తరఫున అద్భుతంగా రాణించడంతో అప్పుడు టీమ్ మెంటార్, ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడి తెచ్చి మరీ హర్షిత్ ను ఎంపిక చేయించాడు. అయితే దీనికోసం హర్షిత్ కూడా బాగానే కష్టపడుతున్నాడు. తన ఫిట్‌నెస్ పై దృష్టి సారించిన ఈ ఆల్ రౌండర్.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు
కెరీర్ తొలినాళ్లలో వరుస గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో హర్షిత్ సతమతమయ్యేవాడు. ఒక దశలో అతడు మొత్తం క్రికెట్ కే దూరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది . అయితే అతడు మళ్లీ కోలుకొని ఇప్పుడు జాతీయజట్టుకు ఎంపికయ్యాడంటే హర్షిత్ కృషితోపాటు అతని తండ్రి పాత్ర కూడా చాలానే ఉంది. అందుకే తాను సాధించిన సక్సెస్ క్రెడిట్ తన తండ్రిదే అని హర్షిత్ చెబుతున్నాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడటమే తన లక్ష్యమని హర్షిత్ చెబుతున్నాడు.
ఈ ఏడాది కోల్ కత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో ఈ యువ పేసర్ కీలకపాత్ర పోషించాడు. చక్కని బౌలింగ్ తో 19 వికెట్లు తీశాడు. కేకేఆర్ మెంటార్ గా హర్షిత్ సత్తా దగ్గరి నుంచి గమనించిన గంభీర్ ఆసీస్ టూర్ కు ప్రత్యేకంగా అతన్ని తీసుకొచ్చాడు. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత హర్షిత్ రెండుసార్లు వైట్ బాల్ జట్టుకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆసీస్ టూర్ సుధీర్ఘమైనది కావడంతో హర్షిత్ ను బ్యాకప్ కు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే ఈ టూర్ కు ముందు హర్షిత్ రాణా మంచి ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు . ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అస్సాంతో మ్యాచ్ లో ఈ ఢిల్లీ పేసర్ 5 వికెట్లు తీయడంతోపాటు 8వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ కూడా చేశాడు.