ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (Andhra Pradesh Elections) మరోసారి కడప ఎంపీ (Kadapa MP) సీటు కాక రేపబోతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి MP Avinash Reddy) వర్సెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో హాట్ టాపిక్ గా మారింది. అన్నా, చెల్లెళ్ల మధ్య సమరం ఆసక్తిరేపుతోంది.
వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ (Congress) ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. పోటీ చేసే అభ్యర్థుల్ని ఆ పార్టీ ఖరారు చేసింది. షర్మిల పోటీ చేసే స్థానంపైనా AICC క్లారిటీ ఇచ్చింది. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు. టీడీపీ (TDP) నుంచి భూపేష్ రెడ్డి (Bhupesh Reddy) రేసులో ఉన్నారు. YSR టీపీని విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీకి షిష్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఇప్పుడు వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపైనే పోటీ చేయబోతున్నారు.
ఈ ఎన్నికల్లో పోటీకి షర్మిల విముఖత చూపినట్టు మొదట్లో వార్తాలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ జోక్యంతో ఆమె కడప ఎంపీ సీటుకు పోటీ చేయబోతున్నారు. వివేకా హత్య కేసు విషయంలో మొదటి నుంచీ వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచారు షర్మిల. ఇప్పుడు సోదరుడు అవినాష్ రెడ్డిపైనే పోటీకి దిగితూ… అటు అన్న జగన్ ను కూడా సవాల్ చేస్తున్నారు. కడప ఎంపీగా గెలిచి… తన బాబాయ్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరుస్తానని షర్మిల శపథం చేస్తున్నారు. దాంతో ఈసారి కడప గడపలో పోటీ రసవత్తరంగా మారబోతోంది.
కడప అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన షర్మిల కడపలో పోటీకి సై అంటుండటంతో ఆసక్తి రేపుతోంది. షర్మిల బరిలోకి దిగితే అవినాష్ రెడ్డితో పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. కడప ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో అనేది ఉత్కంఠ రేపుతోంది. కడపలో షర్మిల గెలిస్తే… ఏపీలో కాంగ్రెస్ ఊపిరి పోసుకున్నట్టే అంటున్నారు విశ్లేషకులు. అలాగే అన్న జగన్ కు చెక్ పెట్టినట్టే అన్న టాక్ నడుస్తోంది.