Forbes Richest List 2024: ఫోర్బ్స్ సంపన్నుల జాబితా విడుదల.. టాప్-10లో అంబానీ.. అదానీ స్థానం ఎంతంటే..

ఈ లిస్టులో టాప్‌లో నిలిచాడు ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్. 75 ఏళ్ల ఈ వ్యాపారవేత్త మొత్తం నికర సంపద విలువ దాదాపు 233 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో 19 లక్షల కోట్లు.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 01:33 PM IST

Forbes Richest List 2024: ఫోర్బ్స్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచ సంపన్నుల జాబితా విడుదల చేస్తుందనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ జాబితా విడుదల చేసింది. 2024కుగాను ప్రపంచ సంపన్నుల జాబితాలో భారతీయులకు చోటు దక్కింది. ఇండియా నుంచి ఈ ఏడాది 200 మంది చోటు దక్కించుకున్నారు. గతేడాది 167 మంది భారతీయులకే ఈ జాబితాలో చోటు దక్కగా.. ఈసారి మాత్రం మనవాళ్లు పెరిగారు. ఈ లిస్టులో టాప్‌లో నిలిచాడు ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్ళీ రిలీఫ్.. సీఎంగా కొనసాడంపై రాష్ట్రపతి, గవర్నర్‌దే నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు

75 ఏళ్ల ఈ వ్యాపారవేత్త మొత్తం నికర సంపద విలువ దాదాపు 233 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో 19 లక్షల కోట్లు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను దాటి బెర్నార్డ్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు ఎలాన్ మస్క్. ఆయన సంపద విలువ 195 బిలియన్ డాలర్లు. అంటే 16 లక్షల కోట్లు. ఆ తర్వాతి 194 బిలియన్ డాలర్లతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మూడో స్థానంలో, 177 బిలియన్ డాలర్ల సంపదతో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ నాలుగో స్థానంలో, 141 బిలియన్ డాలర్లతో ఒరాకిల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ఐదవ స్థానంలో, 133 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆరో స్థానంలో, 128 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ ఏడో స్థానంలో, మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బాల్మర్ ఎనిమిదో స్థానంలో, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో, గూగుల్‌ కో-ఫౌండర్‌ లారీ పేజ్ పదో స్థానంలో ఉన్నారు.

ఇండియా నుంచి టాప్‌-10లో నిలిచింది ముకేష్ అంబానీ ఒక్కరే. ఆయన సంపద దాదాపు 116 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 9.6 లక్షల కోట్లు. ఇండియాలోనే రెండో స్థానంలో ఉండే వ్యాపారవేత్త అదానీ. ఆయన 84 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ జాబితాలో 17వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 36.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో, 33.5 బిలియన్ డాలర్ల సంపదతో సావిత్రి జిందాల్ నాలుగో స్థానంలో, 26.7 బిలియన్ డాలర్ల సంపదతో దిలీప్ సంఘ్వీ ఐదో స్థానంలో నిలిచారు. వీళ్ల ర్యాంకింగ్స్ ఇండియాకు సంబంధించినవే. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల మొత్తం సంపద 79 లక్షల కోట్లుగా ఉంది.