VV Lakshminarayana: తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ జైభారత్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖపట్నంలో తన ప్రాణాలు తీసేందుకు కుట్ర జరుగుతోందని, తనకు రక్షణ కల్పించాలంటూ విశాఖపట్నం సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల నుంచి తనకు ఈ ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
TOLLYWOOD SONGS: సమ్మర్‌లో సినిమాలు లేకున్నా.. పాటల పండుగ కన్ఫామ్..
గాలి జనార్థన్ రెడ్డి అనుచరులు కొందరు విశాఖపట్నంలో ఉన్నారని.. వాళ్లంతా తన కార్యకలాపాలను కనిపెడుతూ తనను హత్య చేసేందుకు సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఇప్పటికే తనపై రెక్కి సైతం నిర్వహించారని తనకు అనుమానం కలుగుతుందని చెప్పారు. విశాఖ నార్త్ నియోజవర్గం నుంచి జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వీవీ లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సీబీఐ జేడీగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశారు. సత్యం రామలింగరాజు కేసు నుంచి మెుదలుకొని గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారం, అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్‌కేసును సైతం డీల్ చేశారు. సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ కేసుల వరకు అనేక కేసులను డీల్ చేసిన లక్ష్మీనారాయణ దేశంలోనే మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పేరొందారు. అనంతరం యూపీ కేడర్ ఐపీఎస్‌కు రాజీనామా చేసి.. ప్రజల జీవన స్థితిగతులపై అధ్యయనం చేశారు.
అనంతరం 2019లో రాజకీయాల్లో చేరారు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖపట్నం లోక్‌సభకు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 లక్షల 88 వేలు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి. కానీ ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. సొంతంగా జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అకస్మాత్తుగా తనను హత్య చేసేందుకు రెక్కీ సైతం నిర్వహించారని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.